తన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల మీద మాత్రమే తాను దృష్టి పెడతానని టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. అంతేతప్ప తనకు తగిలిన ఎదురుదెబ్బల గురించి ఆలోచిస్తూ.. అందుకు కారణమైన వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండిపోనని స్పష్టం చేశాడు.
కాగా వన్డే ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్‌తో పోలిస్తే మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ సంజూకు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. అంతకు ముందు కీలక సిరీస్‌లలోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌కు అన్యాయం జరుగుతోందంటూ బీసీసీఐపై ఇప్పటికే అనేకసార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు ఈ కేరళ బ్యాటర్. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సంజూ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాడు.
అయితే, మొదటి రెండు వన్డేల్లో ప్రభావం చూపలేకపోయిన సంజూ శాంసన్.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. తద్వారా సిరీస్ టీమిండియా సొంతమైంది. ఇక ఎనిమిదేళ్ల కెరీర్‌లో సంజూకు ఇదే తొలి శతకం కావడం విశేషం.
ఈ నేపథ్యంలో బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా క్రికెటర్‌గా.. మీడియా ఒత్తిడి, మైదానం లోపల.. వెలుపలా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కోల్పోకుండా ఉండటమే ముఖ్యం. నా మనసును ఎలా నియంత్రించుకోవాలన్న విషయం మీదే దృష్టి పెడతాను. బయట చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు. కానీ.. నేను మాత్రం ఎల్లప్పుడూ నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తాను.
నా లోటుపాట్లు సరిదిద్దుకోవడం, వైఫల్యాలను అధిగమించడంపై ఫోకస్ చేస్తా. అంతేకానీ.. నేను మిస్సైన ఈవెంట్ల గురించి ప్రస్తావిస్తూ.. అందుకు కారణమైన వారి గురించి ఫిర్యాదులు చేస్తూ కూర్చోను. నా నైపుణ్యాలకు ఎలా సానపెట్టాలి? నేను ఓపికగా ఉండగలుగుతున్నానా?
స్థాయికి తగ్గట్లు ఆడుతున్నానా? అన్న విషయాల గురించే ఆలోచిస్తా. విజయ్ హజారే ట్రోఫీలో కేరళ సారథిగా నేను ఎంతో కఠిన శ్రమకోర్చాను. ఆలోచనలను నియంత్రించుకుంటూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికలను అమలు చేశాను’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2023లో సంజూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 293 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యాడు.
చదవండి: టీమిండియాకు ఊహించని షాక్.. సూర్యకుమార్ గాయం తీవ్రం! నెలల పాటు..
Comments
Please login to add a commentAdd a comment