నాడు కోచ్‌తో మనూ గొడవ.. కట్‌ చేస్తే! | How Manu Bhaker Buried Hatchet With Coach Rana He Says 3 Year Curse Lifted, Know What Happened Exactly | Sakshi
Sakshi News home page

నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ రాణా సంతోషం

Published Mon, Jul 29 2024 11:45 AM | Last Updated on Mon, Jul 29 2024 2:47 PM

How Manu Bhaker Buried Hatchet With Coach Rana He Says 3 Year Curse Lifted

అభినవ్‌ బింద్రా, రాణాతో మనూ

మనూ భాకర్‌.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన ఈ హర్యానా అమ్మాయి.. భారత్‌ తరఫున మెడల్‌ గెలిచిన తొలి మహిళా షూటర్‌గా రికార్డు సాధించింది. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు అందుకున్న మనూ భాకర్‌ ఖాతాలో.. ఇప్పుడు ఒలింపిక్‌ మెడల్‌ కూడా చేరింది. టోక్యోలో నిరాశ ఎదురైనా పడిలేచిన కెరటంలా మనూ ‘బుల్లెట్‌’లా దూసుకొచ్చిన తీరు అద్భుతం. 

అయితే, ఈ ప్రయాణంలో 22 ఏళ్ల మనూకు తన తండ్రి రామ్‌కిషన్‌ భాకర్‌ ప్రోత్సాహంతో పాటు.. కోచ్‌ జస్పాల్‌ రాణా.. ‘‘పెద్దన్న’’లా క్షమించి, మళ్లీ శిక్షణ తీరు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడింది. ఏమిటా కథ?!

మనూ భాకర్‌ కెరీర్‌లో రెండు వేర్వేరు సందర్భాలు ఆమె ప్రస్థానంలో కీలకంగా నిలిచాయి. 2018–2019 సమయంలో మనూ వరుస విజయాలతో అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ సమయంలో భారత జట్టు (పిస్టల్‌)కు మాజీ ఆటగాడు జస్పాల్‌ రాణా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో 17 ఏళ్ల ఒక టీనేజర్‌ ఎలా దుందుడుగా, ఆవేశంగా ఉంటారో భాకర్‌ కూడా అదే తరహా మానసిక స్థితిలో ఉంది. 

కోచ్‌పై ఆగ్రహం.. ఎందుకంటే?
రాణా కఠినమైన కోచింగ్‌ శైలి నచ్చక ఆమె బహిరంగంగానే చిన్న చిన్న విమర్శలు చేస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత ఇది మరింత పెరిగింది. మనూ వేర్వేరు ఈవెంట్లలో ఆడితే ఆమె విఫలమయ్యే అవకాశం ఉందని 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌పైనే దృష్టి పెట్టాలంటూ రాణా సూచించాడు.

మీ అహానికి అభినందనలు
25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో మరో షూటర్‌ చింకీ యాదవ్‌ను ప్రోత్సహించడాన్ని భాకర్‌ వ్యక్తిగతంగా తీసుకొని కోచ్‌పై మరింత ఆగ్రహాన్ని పెంచుకుంది. చివరకు టోక్యో ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు ఢిల్లీ వరల్డ్‌ కప్‌లో ఇది పూర్తిగా బయటపడింది. 10 మీటర్ల ఈవెంట్‌లో చింకీ స్వర్ణం గెలవగా, మనూ కాంస్యానికే పరిమితమైంది. దాంతో మనూ ‘ఆనందం దక్కింది కదా... మీ అహానికి అభినందనలు’ అంటూ రాణాకు మెసేజ్‌ చేసింది.

‘సర్‌...నాకు మీరు మళ్లీ కోచింగ్‌ ఇస్తారా’ 
ఆ వాక్యాలను రాణా తన టీషర్ట్‌పై వెనుక భాగంలో రాసుకొని మైదానమంతా తిరిగాడు. దాంతో మనూతో అక్కడే అన్ని సంబంధాలు ముగిసిపోయాయి! కాలక్రమంలో రెండేళ్లు గడిచాయి. ఏడాది క్రితం మనూలో కొత్త మథనం మొదలైంది. తాను ఒలింపిక్‌ పతకం గెలవాలంటే సరైన దారి మళ్లీ సరైన కోచ్‌ను ఎంచుకోవడమే అనిపించింది. ఎంతో మథనం తర్వాత రాణాకు ‘సర్‌...నాకు మీరు మళ్లీ కోచింగ్‌ ఇస్తారా’ అని మెసేజ్‌ చేసింది.

ఒక పెద్దన్న తరహాలో రాణా కూడా స్పందించాడు. గత అనుభవాన్ని మనసులోంచి తీసేసి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సంవత్సర కాలంలో తనదైన శైలిలో ఆమెకు కోచింగ్‌తో పాటు ఇతర అన్ని సన్నాహకాల్లో అండగా నిలుస్తూ ఇప్పుడు ఒలింపిక్‌ పతకం వరకు తీసుకొచ్చాడు. వారి సన్నాహాల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది.

లక్ష్యంగా పెట్టుకున్న పాయింట్లు సాధించలేనప్పుడు తగ్గిన పాయింట్లలో ఒక్కో పాయింట్‌కు 10 యూరోల చొప్పున జరిమానా విధించి దానిని అక్కడి పేదవారికి దానం చేయాలనేది ఒక షరతు! ఇప్పుడూ భాకర్‌ వయసు 22 ఏళ్లే... కానీ గతంతో పోలిస్తే ఎంతో పరిపక్వతతో వ్యవహరించిన ఆమె విజయానికి బాటలు వేసుకుంది. పతకం కోసం పోటీ పడిన సమయంలో జనంలో కూర్చొని ఉన్న రాణాను చూస్తూ ధైర్యం తెచ్చుకున్నానని, తమ శ్రమ ఫలితాన్నందించిందన్న మనూ... రాణాకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పడం విశేషం.

శాపం తొలగిపోయింది
ఇక రాణా స్పందిస్తూ.. ‘‘నా మనసుకు ఇప్పుడు ఉపశమనంగా ఉంది. టోక్యో నుంచి కొనసాగుతున్న శాపం తొలగినట్లనిపించింది. నాటి ఓటమి నుంచి పూర్తిగా కోలుకున్నామని చెప్పలేను. అయితే, మనూ మెడల్‌ సాధించడం మాకు నిజంగా బిగ్‌ రిలీఫ్‌. ప్రతి విషయంలోనూ అతిగా స్పందించడం నాకూ అలవాటే. అయితే, ఆమె మరోసారి నన్ను సంప్రదించినపుడు తనకు నో చెప్పలేకపోయాను. ఇద్దరం మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం. తను ఇప్పుడు పరిణతి సాధించిన అథ్లెట్‌. తన విజయానికి ప్రధాన కారణం ఇదే’’ అని ట్రిబ్యూన్‌తో పేర్కొన్నాడు.
-సాక్షి, క్రీడా విభాగం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement