వరల్డ్‌కప్‌ తుది పోరు రేపే.. ఫైనల్స్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే? | How Many World Cup Finals Have India Played? What Is The Team India Record In ICC ODI World Cup Finals? - Sakshi
Sakshi News home page

World Cup 2023 IND Vs AUS Finals: వరల్డ్‌కప్‌ తుది పోరు రేపే.. ఫైనల్స్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

Published Sat, Nov 18 2023 3:30 PM | Last Updated on Sat, Nov 18 2023 4:54 PM

How many World Cup finals have India played? What is their record in ICC CWC finals? - Sakshi

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా ప్రపంచకప్‌-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌ వేదికగా మరో 24 గంటల్లో ఈ మెగా టోర్నీ తుది తుది సమరానికి తెరలేవనుంది. పది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా.. ప్రత్యర్ధి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.

ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్లో అడుగు పెట్టింది? ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్‌ చేరిందంటే?
వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్లో టీమిండియాకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ ఏడాదితో కలిపి నాలుగు సార్లు వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. 1987 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారి భారత్ ఫైనల్‌కు చేరింది. అనంతరం 2003 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో కెన్యాను చిత్తు చేసి రెండో సారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్‌ అడుగుపెట్టింది.

ఆ తర్వాత 2011 వరల్డ్‌కప్‌ టోర్నీలో సెమీస్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌ బెర్త్‌ను భారత్‌ ఖరారు చేసింది. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీ కంటే ముందు మూడు సార్లు ఫైనల్‌కు చేరిన టీమిండియా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది.

కపిల్‌ డేవిల్స్‌ అద్బుతం..
1987 వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. తొలిసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్‌కు చేరడమే కాకుండా పటిష్ట వెస్టిండీస్‌ను ఓడించి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 54.4 ​ఓవరల్లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. అనంతరం 184 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌.. భారత బౌలర్ల దాటికి 140 పరుగులకే కుప్పకూలింది.

దీంతో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో మదన్‌ లాల్‌, మొహిందర్ అమర్‌నాథ్ తలా మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు సంధు రెండు, బిన్నీ, కపిల్‌ దేవ్‌ చెరో వికెట్‌ సాధించారు.

ఆసీస్‌ చేతిలో ఘోర పరాభావం..
2003 వరల్డ్‌కప్‌లో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని టీమిండియా రన్నరప్‌గా నిలిచింది.  జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫైనల్లో 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ  స్కోర్‌ సాధించింది.

ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(140 నాటౌట్‌) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పాంటింగ్‌తో పాటు డామియన్ మార్టిన్(88 నాటౌట్‌), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(57) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్‌ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు

అనంతరం 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో సెహ్వాగ్‌ ఒక్కడే 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో రెండో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను టీమిండియా ఓటమితో ముగించింది.

మిస్టర్‌ కూల్‌ మాయ..
2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన ధోని సారథ్యంలోని భారత జట్టు.. 28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫిని ముద్దాడింది. ఈ ఫైనల్‌ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది.

శ్రీలంక బ్యాటర్లలో మహేలా జయవర్ధనే (88 బంతుల్లో 103, 13 ఫోర్లు) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్‌ సింగ్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది.

తొలి ఓవర్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0) డకౌట్ అయ్యాడు. మరికాసేపటికే సచిన్ టెండూల్కర్ (18) అవుటయ్యాడు. దాంతో భారత్ 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లి (35)తో జతకట్టిన గౌతం గంభీర్ జట్టును నడిపించాడు. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లిని దిల్షాన్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా యువరాజ్‌ స్ధానంలో మహేంద్ర సింగ్‌ ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 170 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. గంభీర్, ధోని అద్భుతంగా ఆడుతూ భారత్ ను విజయానికి చేరువ చేశారు. అయితే 97 పరుగులతో సెంచరీకి చేరువలోన్న గౌతం గంభీర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ధోని సిక్స్‌ కొట్టి జట్టును వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement