ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్‌ శర్మ | Have Prepared For This Day: Rohit Sharma Ahead Of IND vs AUS World Cup 2023 Final | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్‌ శర్మ

Published Sat, Nov 18 2023 8:07 PM | Last Updated on Sat, Nov 18 2023 9:04 PM

Have Prepared For This Day: Rohit Sharma Ahead Of IND vs AUS World Cup 2023 Final - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఏంతో అతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ పోరుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా తుది పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఇప్పటికే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.

ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు..  ఫైనల్లో కూడా తమ జోరును కొనసాగించి మరోసారి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అన్ని విధాల సిద్దమైనట్లు రోహిత్‌ తెలిపాడు.

ఏమి చేయాలో మాకు బాగా తెలుసు..
"నేను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ఈ వరల్డ్‌కప్‌ కోసం మేము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించాము. మూడు ఫార్మాట్లలో మేము ఒక యూనిట్‌గా అద్బుతంగా రాణిస్తున్నాం. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి వారి పాత్రపై ఒక క్లారిటీ ఉంది. మూడు ఫార్మాట్‌లలో  ఆటగాళ్ల ప్రదర్శన బట్టి అవకాశాలు ఇస్తూ వస్తున్నాం.

ఇప్పటివరకు ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శన కనబరిచాం. రేపు కూడా అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. ఇక ఆస్ట్రేలియాను మేము తేలికగా తీసుకోము. ప్రపంచక్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఈ టోర్నీలో వరుసగా 8 కి ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు వచ్చింది. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో మాకు తెలుసు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అయితే మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. వాటిపై మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాము. వారి ఫామ్‌ను చూసి మేము ఎటువంటి ఆందోళన చెందడం లేదు. మాపై చాలా అంచనాలు ఉన్నాయి.

టోర్నీ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ వాటిన్నంటిని తట్టుకుని ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా మేము ప్రశాంతమైన వాతావారణం ఏర్పరుచుకున్నామని" రోహిత్‌ పేర్కొన్నాడు.

బౌలర్ల గురించి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము తొలి నాలుగు,ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ చేసి విజయం సాధించాం. ప్రత్యర్ధి జట్లను 300 కంటే తక్కువకు పరిమితం చేయడంలో మా బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పేసర్లు  స్పిన్నర్లు ఇద్దరూ అదరగొట్టారు. మేము టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోవడంలోనూ  మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు.  బుమ్రా, షమీ, సిరాజ్ కొత్త బంతితో అద్బుతాలు చేయగా.. మిడిల్‌ ఓవర్లలో స్నిన్నర్లు కూడా అత్యుత్తమంగా రాణించారు" అని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement