మెరుపుల్లేని సన్‌రైజర్స్‌! | Hyderabad lost by seven wickets | Sakshi
Sakshi News home page

మెరుపుల్లేని సన్‌రైజర్స్‌!

Published Mon, Apr 1 2024 1:37 AM | Last Updated on Mon, Apr 1 2024 7:24 AM

Hyderabad lost by seven wickets - Sakshi

ఏడు వికెట్లతో హైదరాబాద్‌ ఓటమి

మోహిత్‌ శర్మ అద్భుత బౌలింగ్‌

రాణించిన మిల్లర్, సాయి సుదర్శన్‌

గుజరాత్‌ టైటాన్స్‌కు రెండో గెలుపు  

అహ్మదాబాద్‌: గత బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో సిక్సర్ల మోతతో... బౌండరీల జాతరతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఈసారి అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోవడంతో ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. గత ఏడాది రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించి సన్‌రైజర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మోహిత్‌ శర్మ 25 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను కట్టడి చేశాడు. అనంతరం గుజరాత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఈ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది.  

ముంబై ఇండియన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ ఈసారి మెరిపించలేకపోయింది. ముంబైపై చెలరేగిపోయిన ట్రావిస్‌ హెడ్‌ (14 బంతుల్లో 19; 3 ఫోర్లు), అభిషేక్‌ శర్మ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఈసారీ దూకుడుగా ఆడినా క్రీజులో ఎక్కువసేపు నిలువలేకపోవడం సన్‌రైజర్స్‌ను దెబ్బ తీసింది. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ అవుటవ్వడంతో... 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయి 74 ఇబ్బందుల్లో పడింది.

చివర్లో అబ్దుల్‌ సమద్‌ (14 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశాడు. మెహిత్‌ శర్మ వేసిన చివరి ఓవర్లో హైదరాబాద్‌ 3 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. ఓపెనర్లు సాహా (13 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌) 10 ఓవర్లలోపే పెవిలియన్‌ చేరాయి.

అయితే సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (27 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు కొనసాగిస్తూ మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్‌ అవుటైనా... విజయ్‌ శంకర్‌ (11 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు), మిల్లర్‌ సంయమనంతో ఆడి ఐదు బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్‌ను విజయతీరాలకు చేర్చారు.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) నూర్‌ 19; మయాంక్‌ (సి) నల్కండే (బి) అజ్మతుల్లా 16; అభిõÙక్‌ శర్మ (సి) గిల్‌ (బి) మోహిత్‌ 29; మార్క్‌రమ్‌ (సి) రషీద్‌ (బి) ఉమేశ్‌ 17; క్లాసెన్‌ (బి) రషీద్‌ 24; షహబాజ్‌ (సి) తెవాటియా (బి) మోహిత్‌ 22; సమద్‌ (రనౌట్‌) 29; సుందర్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 0; కమిన్స్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–34, 2–58, 3–74, 4–108, 5–114, 6–159, 7–159, 8–162. బౌలింగ్‌: అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 3–0–24–1, ఉమేశ్‌ యాదవ్‌ 3–0–28–1, రషీద్‌ ఖాన్‌ 4–0–33–1, నూర్‌ అహ్మద్‌ 4–0–32–1, మోహిత్‌ శర్మ 4–0–25–3, దర్శన్‌ నల్కండే 2–0–18–0. 

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) కమిన్స్‌ (బి) షహబాజ్‌ 25; గిల్‌ (సి) సమద్‌ (బి) మార్కండే 36; సాయి సుదర్శన్‌ (సి) అభిషేక్‌ శర్మ (బి) కమిన్స్‌ 45; మిల్లర్‌ (నాటౌట్‌) 44; విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–36, 2–74, 3–138. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–27–0, షహబాజ్‌ అహ్మద్‌ 2–0–20–1, జైదేవ్‌ ఉనాద్కట్‌ 3.1–0–33–0, వాషింగ్టన్‌ సుందర్‌ 3–0–27–0, మయాంక్‌ మార్కండే 3–0–33–1, కమిన్స్‌ 4–0–28–1.   

ఐపీఎల్‌లో నేడు
ముంబై  X రాజస్తాన్‌ 
వేదిక: ముంబై 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement