
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు ఆటగాళ్లతో ఏ రకమైన పోలికలు కూడా తనకు ఇష్టం లేదని మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడతానని ఆమె చెప్పింది. అయితే జట్టుకు విజయాలు అందించే విషయంలో మాత్రం స్ఫూర్తి పొందడంలో తప్పు లేదని స్మృతి అభిప్రాయ పడింది. అందుకే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తరహాలో మ్యాచ్‌లు గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పింది. ‘మహిళల టీమ్ కోహ్లి అనిపించుకోవడంకంటే భారత మహిళల జట్టు సభ్యురాలు స్మృతి మంధాన అనిపించుకోవడమే నాకు ఇష్టం.
అతను జట్టును గెలిపించేందుకు ఎలా ఆడతాడనేది మాత్రం నేను చూస్తాను. దానినుంచి స్ఫూర్తి పొందుతాను. అదే తరహాలో మ్యాచ్ గెలిచే వరకు పట్టుదలగా నిలబడాలని కోరుకుంటా. కోహ్లి నిలకడైన బ్యాటింగ్ నాకే కాదు అందరికీ ఆదర్శం’ అని మంధాన వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సాంగ్లీవంటి చిన్న ప్రాంతంనుంచి వచ్చి భారత క్రికెటర్‌గా ఎదగడాన్ని తాను గర్వంగా భావిస్తానని ఆమె చెప్పింది. తాను క్రికెటర్ కావాలని తల్లిదండ్రులు ఎంతో కోరుకొని అండగా నిలిచారని... సోదరుడు శ్రవణ్ సహకారంతో బ్యాట్ పట్టి ఆటలోకి ప్రవేశించినట్లు స్మృతి గుర్తు చేసుకుంది.
సంగక్కర అంటే ఇష్టం...
ఆరేళ్ల కెరీర్‌లో తాను ఎంతో నేర్చుకున్నానని ఈ భారత ఎడమ చేతి వాటం ఓపెనర్ వెల్లడించింది. సీనియర్ స్థాయిలో మహారాష్ట్ర తరఫున ఆడి సెంచరీ సాధించిన రోజున తన భవిష్యత్‌పై నమ్మకం కుదిరిందన్న స్మృతి... సుదీర్ఘ కాలం భారత జట్టు తరఫున ఆడాలనేదే కోరికని స్పష్టం చేసింది. ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర శైలిని అనుసరించానని చెప్పింది. ‘ఆయన బ్యాటింగ్ నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ కవర్ డ్రైవ్‌లు అద్భుతంగా ఉంటాయి.
పైగా ఎడమ చేతివాటం కూడా కాబట్టి సంగక్కరను అనుకరించే ప్రయత్నం కూడా చేశాను’ అంటూ తన అభిమానాన్ని ప్రదర్శించింది. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాక ముందు ‘ నా చెల్లెలి కోసం’ అంటూ రాహుల్ ద్రవిడ్ వద్ద తన సోదరుడు ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ప్రయత్నించాడని... ఆయన తన సంతకం చేసి మరీ ఒక బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారని స్మృతి మధుర స్మృతులు పంచుకుంది. దానిని ముందుగా జ్ఞాపికగా ఉంచుకోవాలని భావించినా... ఆ తర్వాత పలు మ్యాచ్‌లలో దాంతోనే బ్యాటింగ్‌కు దిగినట్లు మంధాన వెల్లడించింది.
మైదానంలో దిగేందుకు సిద్ధం...
కరోనా కారణంగా సుదీర్ఘ కాలం ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని, అయితే దాని గురించి ఎప్పుడూ చింతించలేదని స్మృతి చెప్పింది. గతంలో రెండు వారాలకు మించి ఇంట్లో లేనని, ఇప్పుడు కుటుంబసభ్యులతో గడిపే అవకాశం రావడం మంచిదేనంది. అయితే సాధ్యమైనంత త్వరగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఉమెన్ టి20 చాలెంజర్ కోసం ఎదురు చూస్తున్నానంది. తాను సినిమాలు ఎక్కువగా చూడనన్న స్మృతి... కొన్ని మూఢ నమ్మకాలు మాత్రం ఉన్నాయని చెప్పింది. పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను పోల్చడాన్ని తప్పుపట్టింది. ఫెడరర్ ఆటను ఇష్టపడేవాళ్లు, సెరెనా విలియమ్స్ ఆటను ఇష్టపడేవాళ్లు వేర్వేరుగా ఉంటారని, అందరికీ అన్ని నచ్చాలని ఏమీ లేదని మంధాన అభిప్రాయ పడింది.
Comments
Please login to add a commentAdd a comment