వరల్డ్‌కప్‌ గురించి ప్రశ్న.. అదిరిపోయే సమాధానం చెప్పిన ధోని  | Iam Not Playing World Cup, Dhoni Response On T20 World Cup Question | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ గురించి ప్రశ్న.. అదిరిపోయే సమాధానం చెప్పిన ధోని 

Published Sat, Oct 22 2022 3:33 PM | Last Updated on Sat, Oct 22 2022 3:33 PM

Iam Not Playing World Cup, Dhoni Response On T20 World Cup Question - Sakshi

పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభమైన నాటి నుంచి మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేకుండా టీమిండియా తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ బరిలోకి దిగింది. ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ.. గతేడాది (2021) జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించాడు. 2007 ప్రపంచకప్‌ తర్వాత ధోని తొలిసారి పూర్తి స్థాయిలో జట్టుకు దూరంగా ఉన్నాడు. 

ప్రస్తుతం టీమిండియా వరల్డ్‌కప్‌ వ్యూహరచనల్లో తలమునకలై ఉంటే.. ధోని తన వ్యాపార కార్యకలాపాలను చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. తాజాగా రాంచీలో జరిగిన ఓ ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ధోని.. స్థానిక విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పి అందరినీ నవ్వించాడు. సదరు విలేకరి ధోనిని ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌ గురించి ప్రశ్నించబోగా.. సారీ నేను వరల్డ్‌కప్‌ ఆడటం లేదు.. భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిందంటూ నవ్వుతూ కౌంటరిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.

కాగా, టీమిండియాకు మూడు ఐసీసీ టైటిల్స్‌ అందించిన ఘనత కేవలం మహేంద్రసింగ్‌ ధోనికి మాత్రమే సొంతం అన్న విషయం అందరికీ తెలిసిందే. ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌ అలాగే 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచింది. టీమిండియాకు ధోని అందించిన ఈ ఐసీసీ టైటిల్సే​ చివరివి కూడా కావడం విశేషం. 2013 తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేదు. భారత్‌.. తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరినా, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement