![ICC Mens T20I Cricketer Of Year 2022 Nominees Revealed Surya-In-List - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/29/Surya.jpg.webp?itok=_X3UTvkB)
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ ఈ ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా టి20ల్లో అతను చెలరేగిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ వరకు రావడంలో సూర్యకుమార్‌ది కీలకపాత్ర. కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయాడు. ఈ విధ్వంసమే అతన్ని తాజాగా ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసింది.
ఈ ఏడాది టి20 క్రికెట్‌లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులతో సత్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ 2022 టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా నుంచి సూర్యకుమార్‌తో పాటు ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాలు పోటీ పడుతున్నారు.
సూర్యకుమార్:
ఇక టి20 వరల్డ్ కప్‌లో ఈ నలుగురు ప్లేయర్స్ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. టి20ల్లో ఈ ఏడాది సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 31 మ్యాచ్‌ల్లో 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్‌లో సూర్య అత్యధికంగా 68 సిక్స్‌లు కొట్టాడు. భీకర ఫామ్ కొనసాగించిన అతను రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు.న్యూజిలాండ్ సిరీస్‌లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్‌లో రెండో టి20 సెంచరీ నమోదు చేశాడు.
సామ్ కరన్:
టి20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ అందుకోవడంలో సామ్ కరన్‌ది కీలకపాత్ర. డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన సామ్ ప్రత్యర్థులను దడ పుట్టించాడు. తన ప్రదర్శనతో అదరగొట్టిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది సామ్ కరన్ 19 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ రిజ్వాన్:
పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20ల్లో చాలా డేంజరస్ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే అతన్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. ఈసారి వరల్డ్‌కప్‌లో అంతగా మెరవనప్పటికి ఏడాది ప్రదర్శన మాత్రం అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు.ఇక రిజ్వాన్ ఈ ఏడాది 25 మ్యాచ్‌ల్లో 996 పరుగులతో పాటు కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు, మూడు స్టంపింగ్స్ చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సికందర్ రజా:
ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన మరో ఆటగాడు జింబాబ్వే సంచలనం.. పాకిస్తాన్ మూలాలున్న ఆల్‌రౌండర్ సికందర్ రజా. జట్టు ఓటమిపాలైనప్పటికి తన ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాడు. మొత్తంగా 24 మ్యాచ్‌ల్లో 735 పరుగులతో పాటు 25 వికెట్లు తీశాడు.
ఇక మహిళల విభాగంలో టీమిండియా నుంచి స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. మందానతో పాటు పాకిస్తాన్ నుంచి నిదా దార్, న్యూజిలాండ్ నుంచి సోఫీ డివైన్, ఆస్ట్రేలియా నుంచి తాహిలా మెక్‌గ్రాత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment