మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నీని (Women's Cricket World Cup Team of the Tournament) ఐసీసీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు భారత్ నుంచి ముగ్గురు, రన్నరప్ జట్టు సౌతాఫ్రికా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది.
అలాగే ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియా నుంచి కూడా ముగ్గురికి చోటు లభించింది. ఈ ఎడిషన్ మరో సెమీ ఫైనలిస్ట్ అయిన ఇంగ్లండ్ నుంచి ఒకరు, లీగ్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ నుంచి ఒకరికి అవకాశం దక్కింది.
ఇంగ్లండ్‌కు చెందిన మరో ప్లేయర్‌కు 12వ సభ్యురాలిగా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు (Harmanpreet Kaur) చోటు దక్కలేదు.
బెర్త్‌లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు చోటు కల్పించలేకపోయామని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రన్నరప్ టీమ్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్, ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు.
లారా సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలు సహా టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలువగా.. కాప్ 2 అర్ద సెంచరీలు సహా 208 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. డి క్లెర్క్ 52 సగటున, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 208 పరుగులు చేసి, 26.11 సగటున 9 వికెట్లు తీసింది.
భారత్ నుంచి టోర్నీ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన దీప్తి శర్మకు చోటు దక్కింది.
మంధన సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేయగా.. జెమీ సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేసింది. దీప్తి సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సహా 22 వికెట్లు తీసి, టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శనలకు గానూ దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.
ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్‌నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో చోటు దక్కించుకున్నారు. గార్డ్‌నర్ రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో పాటు 7 వికెట్లు తీయగా.. సదర్‌ల్యాండ్ ఓ హాఫ్ సెంచరీ చేసి, 17 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ 17.38 సగటున 13 వికెట్లు తీసింది.
పాకిస్తాన్ నుంచి వికెట్‌కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్రా ఈ ప్రపంచకప్‌లో 8 డిస్మిసల్స్‌లో భాగంగా కావడంతో పాటు 62 పరుగులు చేయగా.. ఎక్లెస్టోన్ 14.25 సగటున 16 వికెట్లు తీసింది. 12వ ప్లేయర్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. బ్రంట్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 262 పరుగులు చేసి, 9 వికెట్లు తీసింది.
చదవండి: స్మృతి మంధనకు భారీ షాక్


