
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది(Shaheen Afridi) అనుసరించిన వ్యూహంపై విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ పరంగా అతడి ఆటకు వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఆఖర్లో అతడు వైడ్‌లు వేసిన తీరు ఇందుకు కారణం. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా రిజ్వాన్ బృందం.. ఆదివారం రోహిత్ సేనను ఢీకొట్టిన విషయం తెలిసిందే.
చిరకాల ప్రత్యర్థుల(India vs Pakistan) పోటీని చూసేందుకు భారత సినీ, క్రీడా తారలు దుబాయ్ స్టేడియానికి విచ్చేయగా.. వారికి టీమిండియా పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేసి.. దాయాదిని 241 పరుగులకు కట్టడి చేసింది.
కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
36 ఓవర్లు ముగిసే సరికి
ఇక లక్ష్య ఛేదనలో భారత్ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది... 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే!
సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి.
కానీ మరో వైపు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు!
ఇక పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. ఈ సమయంలో అక్షర్ పటేల్ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతి(42.3 ఓవర్)కి ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్ గెలుపు పూర్తయ్యాయి.

ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడంతో
అయితే, టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఖుష్దిల్ వేయగా.. అంతకంటే ముందు ఓవర్‌లో షాహిన్ ఆఫ్రిది రంగంలోకి దిగాడు. ఆ ఓవర్లో అతడు ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పించింది.
అప్పటిదాకా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన షాహిన్.. కోహ్లి శతకానికి చేరువైన సమయంలో వైడ్స్ వేయడం విమర్శలకు తావిచ్చింది. షాహిన్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లి శతకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
లూజర్.. లూజర్ అంటూ
ఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా లూజర్.. లూజర్ అంటూ అతడి బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కూడా స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి నుంచి నిజంగా ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్. అతడి 51వ వన్డే శతకాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి.
షాహిన్ ఆఫ్రిది వైడ్ బాల్స్ అనే కోరల నుంచి తప్పించుకుని సూపర్ సెంచరీ చేశాడు’’ అని బాలీవుడ్, టాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ షాహిన్ ఆఫ్రిదిని ఉద్దేశించి సెటైరికల్ ట్వీట్ చేశాడు.
చదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment