![If Gillespie Tries This With Pak Team It Will Be A Big Mistake: Basit Ali](/styles/webp/s3/article_images/2024/08/13/Pak.jpg.webp?itok=JD0uo7g0)
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ జట్టు మాజీ ఆటగాడు బసిత్ అలీ ధీమా వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లోనూ బంగ్లా కంటే పాక్ ఎంతో మెరుగ్గా ఉందని.. ఒక్క వరణుడు తప్ప పర్యాటక జట్టును ఓటమిని నుంచి ఎవరూ తప్పించలేరని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంటామని పేర్కొన్నాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 21న రావల్పిండి వేదికగా ఇరు జట్ల మద్య తొలి టెస్టు ఆరంభం కానుండగా.. ఆగష్టు 30 నుంచి రెండో టెస్టుకు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ను ఆ వరణుడే కాపాడాలి. వర్షం పడలేదంటే వారి ఓటమి ఖాయమే!... అసలు మా జట్టుకు వారితో అసలు పోటీ, పోలికే లేదు. బంగ్లాదేశ్ గడ్డపై ఆ జట్టును ఓడించిన ఉత్సాహంలో పాక్ జట్టు ఉంది’’ అంటూ పాక్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశాడు.
అదే విధంగా.. పాక్ టెస్టు జట్టు కొత్త కోచ్ జాసన్ గిల్లెస్పి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిల్లెస్పిని పాకిస్తాన్ రంగంలోకి దించింది. ఇప్పుడు మావాళ్లు ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడతారో లేదో చూడాలి. ఒకవేళ గిల్లెస్పి ఇదే చేయాలని భావిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై గెలిస్తే తన స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment