విండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ (Andre Russell) పొట్టి క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో (ILT20 2025) ఆడుతున్న రసెల్ (అబుదాబీ నైట్‌రైడర్స్).. నిన్న (ఫిబ్రవరి 1) గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో టామ్ కర్రన్ బౌలింగ్‌లో బౌండరీ బాదడంతో రసెల్ పొట్టి క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన 25వ ఆటగాడిగా నిలిచాడు.
ఇక్కడ రికార్డు ఏంటంటే.. రసెల్ ఈ ఘనతను ప్రపంచంలో ఏ ఆటగాడు సాధించనంత వేగంగా (బంతుల పరంగా) సాధించాడు. రసెల్.. 9000 పరుగుల మార్కును కేవలం 5321 బంతుల్లో చేరుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రసెల్ కంటే ముందు ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. మ్యాక్సీ టీ20ల్లో 9000 పరుగులను 5915 బంతుల్లో పూర్తి చేశాడు. టీ20ల్లో 9000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో రసెల్, మ్యాక్సీ తర్వాత ఏబీ డివిలియర్స్ (5985), కీరన్ పోలార్డ్ (5988), క్రిస్ గేల్ ఉన్నారు.
టీ20ల్లో రసెల్ ఇప్పటివరకు 536 మ్యాచ్‌లు ఆడి 26.79 సగటున, 169.15 స్ట్రయిక్‌రేట్‌తో 9004 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత రసెల్ మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 463 మ్యాచ్‌ల్లో 144.75 స్ట్రయిక్‌రేట్‌తో 14562 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 88 అర్ద శతకాలు ఉన్నాయి.
టీ20ల్లో రసెల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదిరిపోయే రికార్డు కలిగి ఉన్నాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేసే రసెల్.. పొట్టి ఫార్మాట్‌లో 25.55 సగటున, 8.71 ఎకానమీతో 466 వికెట్లు పడగొట్టాడు.36 ఏళ్ల రసెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్ కానప్పటికీ ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే ఆడుతున్నాడు.
రసెల్ ప్రస్తుత ILT20 ఎడిషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్‌లో అతను 9 ఇన్నింగ్స్‌ల్లో 158.53 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. రసెల్ ఈ సీజన్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇందులో అతని ఎకానమీ 11.42గా ఉంది.
రసెల్ విషయాన్ని పక్కన పెడితే ఈ సీజన్‌లో అతని జట్టు అబుదాబీ నైట్‌రైడర్స్ చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటిస్థానంలో ఉంది. ఈ సీజన్‌లో నైట్‌రైడర్స్ నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని 9 మ్యాచ్‌లు ఆడి ఆరింట ఓడిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ నైట్‌రైడర్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఇప్పటికే డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
నిన్నటి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గల్ఫ్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన రసెల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్.. గెర్హార్డ్ ఎరాస్మస్ (47), టామ్ కర్రన్ (38 నాటౌట్), హెట్‌మైర్ (20 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment