India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాటపై స్పోర్ట్స్ అనలిస్ట్ మలపాక వెంకట్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అన్నారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ... ‘‘మూడేళ్ల తర్వాత మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. కానీ ఇటు ప్రేక్షకులు గానీ.. అటు హెచ్‌సీఏ గానీ.. ఏదైనా దుర్ఘటన జరిగితే బీసీసీఐ మళ్లీ పదేళ్ల దాకా ఇక్కడ మ్యాచ్ నిర్వహించదు అన్న విషయం గురించి ఆలోచించలేకపోయారు’’ అని వాపోయారు.
అది తొందరపాటు చర్యే!
ఇక టిక్కెట్ల అమ్మకం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఖరి గురించి చెబుతూ.. ‘‘హెచ్‌సీఏ ఎలక్షన్ సమయంలో ఓటింగ్‌కు కేవలం 222 మంది వచ్చినపుడే.. వారం ముందు నుంచీ రెక్కీ చేసేవాళ్లం. క్యూలో ఎలా నిలబడాలి? అన్న అంశం గురించి జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసుకునేవాళ్లం. నిజానికి మ్యాచ్ ఉందంటే.. జనాలు పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదనడం తొందరపాటు చర్యే అవుతుంది.
మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి!
తప్పకుండా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారని తెలుసు. అయినా ఇలా జరగడం దురదృష్టకరం’’ అని మలపాక వెంకట్ పేర్కొన్నారు. మ్యాచ్‌ను మొత్తంగా బాయ్‌కాట్ చేస్తే అప్పుడే పరిస్థితి తీవ్రత ఏమిటో నిర్వాహకులకు అర్థమవుతుందన్నారు. వానను కూడా లెక్కచేయక చాలా మంది క్యూలో నిల్చుని ఉన్నారన్న ఆయన.. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరిగితే అప్పుడు నిర్వాహకులకు తెలిసివస్తుందన్నారు.
ఇక టిక్కెట్ల విషయంలో స్కామ్ జరిగిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదన్నారు మలపాక వెంకట్. అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి ఒకవేళ జరగరాని ఘటన జరిగితే హైదరాబాద్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట తర్వాత స్పందించే బదులు.. రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రి ఏర్పాట్ల గురించి ముందే ఆలోచించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మూడో టీ20 జరుగనుంది. ఇక ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లను మాత్రమే హెచ్‌సీఏ అందుబాటులో ఉంచింది. వీటి కోసం పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్‌కు వెళ్లిన అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు.
చదవండి: Ind A vs NZ A 1st ODI: అదరగొట్టిన శార్దూల్, కుల్దీప్ సేన్.. 167 పరుగులకే కివీస్ ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment