భారత జట్టు
India vs Australia, 1st Test- Nagpur: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇప్పటికైనా పర్యాటక జట్టుకు అశ్విన్ డూప్లికేట్‌కు.. అసలైన అశ్విన్‌కు ఉన్న తేడా ఏమిటో అర్థమై ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
స్పిన్నర్ల దెబ్బకు విలవిల
కాగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్ల దెబ్బకు పర్యాటక జట్టుబ్యాటర్లు విలవిల్లాడిపోయారు. దీంతో.. ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించిన రోహిత్ సేన.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అశూ, జడ్డూ అద్భుతం
ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్వరూపం చూపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 12 ఓవర్లలో 37 పరుగులిచ్చిన అశూ.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరిద్దరి దెబ్బకు ఆసీస్ 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించి భారీ ఓటమిని మూటగట్టుకుంది.
మహేశ్ పితియాతో ప్రాక్టీస్
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా నాగ్‌పూర్ టెస్టుకు వారం రోజుల ముందే ప్రాక్టీసు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక అశ్విన్ మాదిరి బౌలింగ్ చేస్తాడని పేరొందిన గుజరాత్ బౌలర్ మహేశ్ పితియాతో ప్రాక్టీసు చేసింది. అయినప్పటికీ అసలైన పోరులో అశ్విన్ స్పిన్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు ఆసీస్ బ్యాటర్లు.
అశ్విన్‌తో మహేశ్ పితియా
ఈసారి జడ్డూ డూప్లికేట్ కోసం
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసీస్ జట్టుకు చురకలు అంటించాడు. ‘‘ఇప్పటికైనా డూప్లికేట్ అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి.. నిజమైన అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఉన్న తేడా ఆస్ట్రేలియా తెలుసుకుని ఉంటుంది.
ఆల్‌టైట్ గ్రేటెస్ట్‌ను ఎదుర్కొనేందుకు.. ఫస్ట్‌క్లాస్‌లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన యువ బౌలర్‌తో ప్రాక్టీసు చేస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవలేరన్న వాస్తవం గ్రహించాలి. విషయం అర్థమైంది కదా! ఇక ఢిల్లీ మ్యాచ్ కోసం వాళ్లు జడేజా డూప్లికేట్‌ను వెదుకుతారని మాత్రం నేను అనుకోవడం లేదు’’ అని కైఫ్ ట్విటర్ వేదికగా ట్రోల్ చేశాడు.
Australia now know the difference between facing duplicate Ashwin and real Ashwin. You can't prepare to face one of all-time great by facing a young first-class player. Hope they not searching for a Jadeja duplicate in Delhi.
— Mohammad Kaif (@MohammadKaif) February 12, 2023
కాగా తొలి టెస్టులో 70 పరుగులు చేయడంతో పాటు మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు
SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్
BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు?
Comments
Please login to add a commentAdd a comment