ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్‌రౌండర్లను ఈ సిరీస్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు.
ఐదు టెస్టులు
టీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది.
పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.
నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందే
నితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్‌రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్‌లో పదును ఉంది.
మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్‌ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన ఆసీస్ పిచ్‌లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.
పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్‌రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.
మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?
ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?
హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్‌పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్‌ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
నితీశ్ కూడా గంగూలీలా
ఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు.
‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్‌లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం
కాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది.
షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్‌ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్‌లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్‌నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.
చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment