చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు.. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి బంగ్లా ఇన్నింగ్స్‌ను పేకమేడలా కుప్పకూల్చారు. బుమ్రా 4, సిరాజ్, ఆకాశ్‌దీప్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్ముల్ షాంటో (20), షకీబ్ అల్ హసన్ (32), లిట్టన్ దాస్ (22), తస్కిన్ అహ్మద్ (11), నహిద్ రాణా (11), మిరాజ్ (27 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అశ్విన్ సూపర్ సెంచరీతో (113) భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అతనికి జడేజా (86) సహకరించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. కఠినమైన ఎర్రమట్టి పిచ్‌పై వీరిద్దరి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉండింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (56) సైతం అర్ద సెంచరీతో రాణించాడు. పంత్ (39) పర్వాలేదనిపించాడు. రోహిత్ (6), గిల్ (0), కోహ్లి (6), రాహుల్ (16) విఫలమయ్యారు.
బంగ్లా బౌలర్లలో యువ పేసర్ హసన్ మహమూద్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మహమూద్ ఇన్నింగ్స్ ఆరంభంలో భారత బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టాడు. స్వల్ప వ్యవధిలో కీలకమైన రోహిత్, గిల్, కోహ్లి వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం పంత్‌ను కూడా మహమూదే పెవిలియన్‌కు పంపాడు. తస్కిన్ అహ్మద్ 3, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ తీశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారత్ 227 ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment