ఆ దిగ్గజ బ్యాటర్‌ 161 టెస్ట్‌ల్లో కొట్టినన్ని సిక్స్‌లు యశస్వి ఒక్క ఇన్నింగ్స్‌లో కొట్టాడు..! | IND VS ENG 3rd Test: Yashasvi Jaiswal Hit More Sixes In An Innings Than I Did In My Entire Career Says Alastair Cook | Sakshi
Sakshi News home page

ఆ దిగ్గజ బ్యాటర్‌ 161 టెస్ట్‌ల్లో కొట్టినన్ని సిక్స్‌లు యశస్వి ఒక్క ఇన్నింగ్స్‌లో కొట్టాడు..!

Published Mon, Feb 19 2024 6:39 PM | Last Updated on Mon, Feb 19 2024 7:20 PM

IND VS ENG 3rd Test: Yashasvi Jaiswal Hit More Sixes In An Innings Than I Did In My Entire Career Says Alastair Cook - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో రికార్డు డబుల్‌ సెంచరీతో విజృంభించిన టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. యశస్వి ఈ ఇన్నింగ్స్‌ను మలచిన తీరును యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతుంది. స్వదేశీ, విదేశీ క్రికెటర్లన్న తేడా లేకుండా అందరూ యశస్వి డబుల్‌ సెంచరీ చేసిన విధానాన్ని ఆకాశానికెత్తుతున్నారు. 

తాజాగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ దిగ్గజం అలిస్టర్‌ కుక్‌ కూడా యశస్విని పొగడ్తలతో ముంచెత్తాడు. రాజ్‌కోట్‌ టెస్ట్‌లో యశస్వి చేసిన డబుల్‌ సెంచరీని కీర్తించే క్రమంలో కుక్‌ ఓ ఆసక్తికర ప్రస్తావన తీసుకొచ్చాడు. నా 161 టెస్ట్‌ల కెరీర్‌లో కొట్టినన్ని సిక్సర్లను యశస్వి ఒక్క ఇన్నింగ్స్‌లో కొట్టేశాడంటూ ఆసక్తికర కంపారిజన్‌ చేశాడు. రాజ్‌కోట్‌ టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 12 సిక్సర్లు, 14 ఫోర్లు సాయంతో అజేయమైన డబుల్‌ సెంచరీ (214)  చేయగా.. కుక్‌ తన 12 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌ మొత్తంలో కలిపి కేవలం​ 11 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. 

2018లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌డై చెప్పిన కుక్‌.. 45.4 సగటున 33 సెంచరీలు, 57 అర్దసెంచరీల సాయంతో 12472 పరుగులు చేశాడు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో 1442 ఫోర్లు కొట్టిన కుక్‌.. 11 సిక్సర్లను మాత్రమే బాదగలిగాడు. కుక్‌తో పోలిస్తే అతి స్వల్ప కెరీర్‌ కలిగిన యశస్వి కెరీర్‌ ఆరంభ దశలోనే దిగ్గజ బ్యాటర్‌ కెరీర్‌ మొత్తంలో కొట్టిన సిక్స్‌లను మించి కొట్టడం విశేషం. ఈ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

22 ఏళ్ల యశస్వి జైస్వాల్‌ ఇప్పటివరకు తాను ఆడిన ఏడు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 25 సిక్సర్లు, 90 ఫోర్ల సాయంతో 71.8 సగటున 861 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు, ఓ సెంచరీ, రెండు అర్దసెంచరీలు ఉన్నాయి. యశస్వికి టెస్ట్‌ ఫార్మాట్‌తో పాటు టీ20ల్లోనూ ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ టీ20ల్లో 17 మ్యాచ్‌ల్లో 28 సిక్సర్ల సాయంతో 502 పరుగులు చేశాడు. అలాగే 37 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 48 సిక్సర్ల సాయంతో 1172 పరుగులు చేశాడు. 

కాగా, రాజ్‌కోట్‌ టెస్ట్‌లో టీమిండియా టీమిండియా 434 పరుగులు భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి అజేయ డబుల్‌ సెంచరీతో (214 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించాడు. దీనికి ముందు టెస్ట్‌లోనూ యశస్వి డబుల్‌తో చెలరేగాడు. వైజాగ్‌ టెస్ట్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేశాడు. రాజ్‌కోట్‌ టెస్ట్‌లో విజయంతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.  రాంచీ వేదికగా నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement