
Bhuvaneshwar Kumar: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆండ్రూ బల్బిర్నీ వికెట్ పడగొట్టడం ద్వారా భువీ పొట్టి ఫార్మాట్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (34 వికెట్లు) సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. భువీకి ముందు ఈ రికార్డు విండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీల పేరిట ఉండేది. వీరిద్దరు పవర్ ప్లేలో 33 వికెట్లు సాధించారు.
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫలితంగా హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భువీ తొలి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన భువీ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భువీ తన స్పెల్‌లో మెయిడిన్ కూడా వేయడం విశేషం.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లో భువీ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో భువీ బౌలింగ్ చేస్తుండగా స్పీడోమీటర్ మూడు సార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లు చూపించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు వేసిన బంతి 201 Km/h, అదే విధంగా బల్బిర్నీ ఎదుర్కొన్న రెండు బంతులు 208, 201 కిమీ వేగంతో విసిరినట్లుగా రికార్డైంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట నమోదై ఉంది.
చదవండి: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్‌లో ఆడుతాడు'
Comments
Please login to add a commentAdd a comment