లంకతో తొలి టీ20.. భారత తుది జట్టులో ఎవరెవరు..? | Predicted Team India For 1st T20 Against Sri Lanka | Sakshi
Sakshi News home page

లంకతో తొలి టీ20.. భారత తుది జట్టులో ఎవరెవరు..?

Published Fri, Jul 26 2024 1:49 PM | Last Updated on Fri, Jul 26 2024 3:05 PM

Predicted Team India For 1st T20 Against Sri Lanka

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక మధ్య తొలి టీ20 పల్లెకెలె వేదికగా రేపు (జులై 27) జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా సర్వ శక్తులు ఒడ్డనుంది. ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు ఫుల్‌ మెంబర్‌ జట్టును ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత్‌ ఫుల్‌ మెంబర్‌ జట్టుతో ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. ఈ సిరీస్‌కు ముందు భారత్‌ జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడినా అందులో సీనియర్లు ఆడలేదు. సీనియర్లు రాకతో భారత తుది జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడంతో వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్లుగా లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ సిరీస్‌కు వారిద్దరే స్పెషలిస్ట్‌ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. వన్‌డౌన్‌లో ఎవరిని పంపుతారనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ భారత్‌ సంజూ శాంసన్‌, రిషబ్‌ పంత్‌ ఇద్దరూ బరిలోకి దించితే సంజూ వన్‌డౌన్‌లో రావచ్చు. కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తనదైన మార్కు చూపించుకునే క్రమంలో అక్షర్‌ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నాలుగో స్థానంలో నూతన టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఐదో స్థానంలో రిషబ్‌ పంత్‌, ఆరో స్థానంలో రింకూ సింగ్‌, ఏడో స్థానంలో హార్దిక్‌ పాండ్యా,  ఎనిమిదో స్థానంలో శివమ్‌ దూబే, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవి భిష్ణోయ్‌, పేసర్లుగా అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులో ఉండవచ్చు. ఒకవేళ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తే.. శివమ్‌ దూబే స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టుకు ఎంపిక కావచ్చు.

శ్రీలంకతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)..
శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌/రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే/ వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవి భిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement