పొట్టి ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు! | IND Vs AFG, 1st T20I: Rohit Sharma Creates History, Becomes 1st Man To Be Part Of 100 T20I Wins - Sakshi
Sakshi News home page

IND VS AFG 1st T20:పొట్టి ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు!

Published Fri, Jan 12 2024 8:49 AM | Last Updated on Fri, Jan 12 2024 9:40 AM

IND VS AFG 1st T20: Rohit Sharma Scripted History By Becoming The First Mens Player To Register 100 Wins In T20I Cricket - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్‌ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం.

ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డ్యానీ వ్యాట్‌ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్‌లో రోహిత్‌ తర్వాత ఈ రికార్డు పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్‌ తర్వాత భారత్‌ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్‌ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్‌ కెప్టెన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలు సాధించింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. శివమ్‌ దూబే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్‌) చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.  మొహమ్మద్‌ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించగా.. గుర్బాజ్‌ (23), కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్‌ దూబే ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం ఛేదనలో భారత్‌ ఖాతా తెరవకుండానే రోహిత్‌ (0) వికెట్‌ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్‌మన్‌ గిల్‌ (23), తిలక్‌ వర్మ (26), శివమ్‌ దూబే (60 నాటౌట్‌), జితేశ్‌ శర్మ (31 ), రింకూ సింగ్‌ (16 నాటౌట్‌) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ముజీబ్‌ 2, ఒమర్‌జాయ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement