![Rohit Sharma Played Blasting Innings In Three Of The T20I Super Over He Played - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/01/18/Untitled-11.jpg.webp?itok=7B8Sa95l)
సూపర్ ఓవర్ అంటే చాలు టీమిండియా సారధి రోహిత్ శర్మకు పూనకం వస్తుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు మూడు సూపర్ ఓవర్లు ఆడిన హిట్ మ్యాన్ ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి సూపర్ మ్యాన్‌లా రెచ్చిపోయాడు.
నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో రెండు సూపర్ ఓవర్లలో విధ్వంసం సృష్టించిన (4 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 13, 3 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 11) రోహిత్.. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ ఓవర్‌లో 4 బంతుల్లో 15 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ మూడు సందర్భాల్లో రోహిత్ ఆటతీరును చూసిన వారు సూపర్ ఓవర్‌లో హిట్‌మ్యాన్ కాస్త సూపర్ మ్యాన్ అయిపోతాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ సూపర్ ఓవర్‌లోనే కాకుండా అంతకుమందు కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన హిట్‌మ్యాన్ ఆతర్వాత పూనకం వచ్చినట్లు ఊగిపోయి, కెరీర్‌లో ఐదో టీ20 శతకం బాదాడు.
రోహిత్‌తో పాటు రింకూ సింగ్ కూడా రెచ్చిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment