3 వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండగా, మైఖేల్ బ్రేస్‌వెల్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో టీమిండియాను గడగడలాడిస్తున్నాడు.
అతనికి జతగా మరో ఎండ్‌లో మిచెల్ సాంట్నర్ (40 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా చెలరేగుతుండటంతో టీమిండియా డిఫెన్స్‌లో పడింది. 44 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 57 బంతుల్లో శతకం పూర్తి చేసిన బ్రేస్‌వెల్.. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో మూడో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment