ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. అతనితో పాటు శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకం, ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకంతో చెలరేగినప్పటికీ.. న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా టీమిండియా 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
కాగా, ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ బ్రాడ్‌కాస్టర్లపై మండిపడిన ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ చేసిన వెంటనే బ్రాడ్‌కాస్టర్లు టీవీల్లో.. "రోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత చేసిన సెంచరీ" అంటూ ఊదరగొట్టాయి. ఇదే హిట్‌మ్యాన్‌కు కోపం తెప్పించింది. మూడేళ్ల తర్వాత సెంచరీ ఏంటీ..?
ఇది నిజమే అయ్యుండొచ్చు. నేను వన్డేల్లో చివరిసారిగా సెంచరీ చేసింది 2020 జనవరిలో. ఆతర్వాత టెస్ట్‌ల్లో 2021 సెప్టెంబర్ 2న సెంచరీ చేశాను. ఈ విషయం పక్కన పెడితే.. 2020-23 మధ్యకాలంలో నేను ఎన్ని వన్డేలు ఆడానన్న విషయాన్ని బ్రాడ్‌కాస్టర్లు గ్రహించాలి (ఈ మధ్యకాలంలో రోహిత్ కేవలం 12 వన్డేలు, 2 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు).. ఇది చూపించకుండా రోహిత్ శర్మ 1100 రోజుల తర్వాత సెంచరీ చేశాడు, మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడు అంటూ గణాంకాలతో ఊదరగొట్టడం సరికాదని హిట్‌మ్యాన్ మీడియా సమక్షంలో బ్రాడ్‌కాస్టర్లపై ఉగ్రరూపం ప్రదర్శించాడు.
మూడేళ్లు అంటే వినడానికి చాలా లాంగ్ గ్యాప్‌గా అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో బ్రాడ్‌కాస్టర్లు విచక్షణతో ప్రవర్తించాలి, ప్రజలకు తామేమీ మెసేజ్ ఇస్తున్నామో అర్ధం చేసుకోవాలి, ఇలా చేయడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు, వాస్తవాలను వక్రీకరించినట్లవతుందంటూ చురకలంటించాడు. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment