IND vs NZ 3rd ODI: Team India Sets a Target of 386 Runs to New Zealand - Sakshi
Sakshi News home page

IND VS NZ 3rd ODI: రోహిత్‌, గిల్‌ మెరుపు శతకాలు, ఆఖర్లో హార్ధిక్‌ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌

Published Tue, Jan 24 2023 5:12 PM | Last Updated on Tue, Jan 24 2023 5:46 PM

IND VS NZ 3rd ODI: Team India Sets 386 Runs Target For New Zealand - Sakshi

ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.

రోహిత్‌, గిల్‌ ఔటయ్యాక వడవడిగా వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శార్ధూల్‌ ఠాకూర్‌ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించడంతో 375 పరుగుల మార్కు దాటింది.

రోహిత్‌-గిల్‌ క్రీజ్‌లో ఉండగా.. ఓ దశలో టీమిండియా 400 పరుగుల మైలురాయిని సునాయాసంగా దాటుతుందని అంతా భావించారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరు ఔట్‌ కావడం టీమిండియాకు మైనస్‌ అయ్యింది. ఆతర్వాత వచ్చిన కోహ్లి (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్‌) కొద్ది సేపు మెరుపులు మెరిపించినప్పటికీ భారీ స్కోర్‌ చేయలేకపోయాడు.

ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 17; ఫోర్‌, సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (9 బంతుల్లో 14; 2 సిక్సర్లు), వాషింగ్టన్‌ సుం‍దర్‌ (14 బంతుల్లో 9; ఫోర్‌) నిరాశపరిచారు. కివీస్‌ బౌలర్లలో టిక్నర్‌, డఫ్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా..  బ్రేస్‌వెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో భారత్‌ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది.  

కాగా, 3 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే..  సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement