ఊచకోత..; ఒక్కసారి అతడు హిట్టింగ్‌ మొదలుపెడితే ఆపలేం: మార్క్రమ్‌ | Ind vs SA 1st T20: Once He Is Striking Like That Its Pretty Hard To Stop: Markram | Sakshi
Sakshi News home page

అతడు అలా చెలరేగుతుంటే ఏం చేయగలం.. అదొక్కటే మాకు..: మార్క్రమ్‌

Published Sat, Nov 9 2024 4:07 PM | Last Updated on Sat, Nov 9 2024 4:47 PM

Ind vs SA 1st T20: Once He Is Striking Like That Its Pretty Hard To Stop: Markram

యాభై బంతుల్లో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు.. మొత్తంగా 107 పరుగులు.. టీమిండియా స్టార్‌, ఓపెనర్‌ సంజూ శాంసన్‌ డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికా బౌలింగ్‌ను ఒక రకంగా ఊచకోత కోశాడు. ప్రొటిస్‌ బౌలర్లపై అటాక్‌ చేస్తూ పరుగుల విధ్వంసంతో 214కు పైగా స్ట్రైక్‌ రేటు నమోదు చేశాడు. ఆద్యంతం అద్భుతమైన షాట్లతో క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేదు
సంజూ జోరుకు కళ్లెం వేయడానికి సౌతాఫ్రికా కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అతడే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత మార్క్రమ్‌ మాట్లాడుతూ... సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు.

అసాధారణ ఇన్నింగ్స్‌.. అతడిని ఆపలేకపోయాం
‘‘ఈ మ్యాచ్‌లో సంజూ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అతడిని అవుట్‌ చేయడానికి మేము చాలానే ప్లాన్స్‌ వేశాం. ఎప్పటికప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లాం. ఒక్కసారి అతడు అలా క్రీజులో కుదురుకుని హిట్టింగ్‌ మొదలు పెట్టాక.. అతడిని ఆపడం కుదిరేపని కాదు.

అదొక్కటే మాకు సానుకూలాంశం
అతడి ముందు ఒక రకంగా తలొగ్గడం తప్ప ఏమీ చేయలేకపోయాం. అయితే, డెత్‌ ఓవర్లలో మా వాళ్లు బాగా బౌలింగ్‌ చేశారు. గెరాల్డ్‌ కోయెట్జీ, మార్కో జాన్సెన్‌ ఆట తీరు మాకు ఈ మ్యాచ్‌లో సానుకూలాంశం’’ అని మార్క్రమ్‌ పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లో పొరపాట్లను సరి చేసుకుని  మెరుగైన ఆట తీరుతో ముందుకు వస్తామని తెలిపాడు.

 

కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్య సేన శుక్రవారం మార్క్రమ్‌ బృందంతో తొలి మ్యాచ్‌లో తలపడింది. 

 

తిలక్‌ సైతం
డర్బన్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా సంజూ అద్భుత శతకం, తిలక్‌ వర్మ(18 బంతుల్లో 33) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారత బౌలర్ల విజృంభణ
లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో 61 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 

ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయి(3/28) చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒకటి, అవేశ్‌ ఖాన్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్‌ ఎనిమిది పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్‌.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement