
ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లిని వన్డే సారథిగా కొనసాగిస్తారా అన్న అంశం చర్చనీయాంశమైంది.
India vs South Africa 2021 Future of Kohli as a ODI Captain determines in Next Week: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ప్రొటిస్ జట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో డిసెంబరు 8 లేదంటే 9న పయనం కావాల్సి ఉంది. అయితే, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ టూర్‌పై సందిగ్దత నెలకొన్నప్పటికీ భారత ప్రభుత్వం అనుమతినిస్తే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ జట్టును అక్కడికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కివీస్‌తో సిరీస్‌కు అందుబాటులో లేని ఆటగాళ్లను ఇప్పటికే ముంబైకి పంపి క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టును ఎంపిక చేసేందుకు ఈవారం సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టును ప్రకటిస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లయితే.. పూర్తి స్థాయి జట్టును పంపేందుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది కాబట్టి ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు.
కోహ్లిని కొనసాగిస్తారా?
ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లిని వన్డే సారథిగా కొనసాగిస్తారా అన్న అంశం చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికా టూర్ ఎంపిక తర్వాతే కోహ్లి వన్డే కెప్టెన్సీ భవితవ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై బీసీసీఐలోని ఓ వర్గం కోహ్లిని కొనసాగించాలని వాదిస్తుండగా.. మరో వర్గం మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీని మొత్తంగా రోహిత్ శర్మకు అప్పగించాలని పట్టుబడుతోందట.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్-2022, ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ను ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు, తనకంటూ ఓ జట్టును తయారు చేసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సదరు వర్గం గట్టిగానే తమ వాదనను వినిపిస్తోందట. ఏదేమైనా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా నిర్ణయం మీదే కోహ్లి వన్డే కెప్టెన్సీ కొనసాగించాలా వద్దా అన్న అంశం ఆధారపడి ఉంటుంది.
ఇక విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్నప్పటికీ కోహ్లి ఇంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదన్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్‌లోనూ ఆర్సీబీకి ట్రోఫీ అందించలేకపోయాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్నా.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడటంతో తృటిలో ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశం చేజారింది.
చదవండి: Babar Azam IND-Pak XI Team: బాబర్ అజమ్ ఇండో-పాక్ ఎలెవెన్.. టీమిండియా అంటే ఇష్టమనుకుంటా