అక్షర్ పటేల్ ( ఫైల్ ఫోటో )
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఆవేశ్ ఖాన్‌కు ఐదు వికెట్లు
ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది.
అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ
ఇక భారత్ ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టాపార్డర్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్‌డౌన్‌లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు.
రోహిత్ సేనతో చేరిన భరత్
కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment