Ind Vs Sa 3rd Test India Need 8 Wickets To Win: భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఉత్కంఠభరిత ముగింపునకు రంగం సిద్ధమైంది...212 పరుగులంటే సాధారణ విజయలక్ష్యమే...ఇప్పటికే 101 పరుగులు చేసి సఫారీ జట్టు విజయానికి మరో 111 పరుగుల దూరంలో నిలిచింది. కానీ గురువారం ఒక దశలో విజయంపై ఆశలు వదిలేసినట్లు కనిపించిన భారత్ చివరి బంతికి ఎల్గర్ వికెట్ తీసి కొత్తగా ఆశలు రేపింది.
స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్‌లో మరోసారి జట్టును గెలిపించాల్సిన బాధ్యత బౌలర్లపైనే పడింది. నాలుగో రోజు మిగతా ఎనిమిది వికెట్లు తీసి టీమిండియా తొలి సారి దక్షిణాఫ్రికాలో సిరీస్ నెగ్గాలనే కలను నిజం చేసుకుంటుందా... మిగిలిన పరుగులను సఫారీ టీమ్ సాధిస్తుందా చూడాలి.
తక్కువ వ్యవధిలో తప్పును పునరావృతం చేయనివాడే గొప్పగా ఎదుగుతాడు, పంత్ తొందరగా నేర్చుకుంటాడు...మ్యాచ్‌కు ముందు రిషభ్ పంత్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే పంత్ ఎంతో నేర్చుకున్నాడు. తన సహజమైన దూకుడును కొనసాగిస్తూనే పరిస్థితులకు అనుగుణంగా పూర్తి సంయమనంతో అతను బ్యాటింగ్ చేశాడు. సహచరులంతా విఫలమైన చోట తానొక్కడే ‘శభాష్’ అనిపించేలా అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ సెంచరీ సాధించాడు. భారత్ ఈ మాత్రం పోటీనిచ్చే స్థితికి చేరిందంటే అది పంత్ చలవే.
కేప్‌టౌన్: హోరాహోరీగా సాగిన టెస్టు సిరీస్ విజేతను తేల్చే సమయం వచ్చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా గురువారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (30), మార్క్‌రమ్ (16) అవుట్ కాగా...కీగన్ పీటర్సన్ (61 బంతుల్లో 48 బ్యాటింగ్; 7 ఫోర్లు) చక్కటి ఆటతీరుతో పట్టుదలగా నిలిచాడు. షమీ, బుమ్రా చెరో వికెట్ తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 57/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (139 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకం సాధించాడు.
శభాష్ పంత్...
రెండో రోజు రెండో బంతికే పుజారా (9)ను జాన్సెన్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే రహానే (1)ను రబడ పెవిలియన్ పంపించాడు. ఈ స్థితిలో కోహ్లి (143 బంతుల్లో 29; 4 ఫోర్లు), పంత్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. కోహ్లి చాలా జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యతనివ్వగా, మరో ఎండ్‌లో పంత్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. సఫారీ బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న అతను 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే మూడో వికెట్‌కు పంత్‌తో 94 పరుగులు జోడించిన తర్వాత మార్క్‌రమ్ అద్భుత క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగాడు. ఇందులో పంత్ చేసినవి 71 పరుగులు కాగా, కోహ్లి 15 పరుగులు మాత్రమే చేయడం విశేషం. ఆ తర్వాత పంత్‌కు లోయర్ ఆర్డర్‌నుంచి సహకారం కరవైంది. తర్వాతి ఐదుగురు బ్యాటర్లు కలిపి 14 పరుగులే చేశారు! పరిస్థితిని గమనించిన పంత్ తానే చొరవ తీసుకొని వేగంగా ఆడుతూ శతకం దిశగా దూసుకుపోయాడు. 88 వద్ద కేశవ్ మహరాజ్, 94 వద్ద బవుమా కష్టసాధ్యమైన క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన పంత్, తర్వాతి ఓవర్లోనే సింగిల్ తీసి 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) మార్క్‌రమ్ (బి) జాన్సెన్ 10; మయాంక్ (సి) ఎల్గర్ (బి) రబడ 7; పుజారా (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 9; కోహ్లి (సి) మార్క్‌రమ్ (బి) ఎన్‌గిడి 29; రహానే (సి) ఎల్గర్ (బి) రబడ 1; పంత్ (నాటౌట్) 100; అశ్విన్ (సి) జాన్సెన్ (బి) ఎన్‌గిడి 7; శార్దుల్ (సి) వెరీన్ (బి) ఎన్‌గిడి 5; ఉమేశ్ (సి) వెరీన్ (బి) రబడ 0; షమీ (సి) వాన్ డర్ డసెన్ (బి) జాన్సెన్ 0; బుమ్రా (సి) బవుమా (బి) జాన్సెన్ 2; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (67.3 ఓవర్లలో ఆలౌట్) 198.
వికెట్ల పతనం: 1–20, 2–24, 3–57, 4–58, 5–152, 6–162, 7–170, 8–180, 9–189, 10–198.
బౌలింగ్: రబడ 17–5–53–3, ఒలీవియర్ 10–1–38–0, జాన్సెన్ 19.3–6–36–4, ఎన్‌గిడి 14–5–21–3, కేశవ్ మహరాజ్ 7–1–33–0.
Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT
— Cricket South Africa (@OfficialCSA) January 13, 2022
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 101/2.
Comments
Please login to add a commentAdd a comment