
Courtesy: Social Media
కొలంబో: నామమాత్రపు మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రీలంకకు 226 పరుగుల లక్ష్యం విధించింది. భారత ఆటగాళ్లలో పృథ్వీ షా(49), సంజూ శాంసన్(46), సూర్యకుమార్ యాదవ్(40) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక లంక బౌలర్లలో అకిల ధనుంజయ, జయ విక్రమ మూడేసి వికెట్లతో రాణించగా.. చమీరా రెండు, కరుణరత్నే, శనక ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఇండియా ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్‌లో చోటుచేసుకున్న సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలంక క్రికెటర్లకు డెసిషన్ రివ్యూ సిస్టం(డీఆర్‌ఎస్) గురించి ఏమాత్రం అవగాహన లేనట్లు కనిపిస్తోంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే... సూర్యకుమార్ క్రీజులో ఉన్న సమయంలో జయవిక్రమ బంతిని సంధించాడు. స్వీప్ షాట్ ఆడేందుకు సూర్య చేసిన ప్రయత్నం విఫలమైంది. బంతి ప్యాడ్స్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో.. లంక జట్టు డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో బంతి స్టంప్స్‌ను తాకినట్లు తేలడంతో.. సూర్య అవుట్ అయినట్లు ప్రకటించారు. దీంతో.. లంక ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం ఆరంభించారు. వారి సంతోషం చూసి, సూర్యకుమార్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురై క్రీజు వీడి వెళ్లేలా కనిపించాడు.
ఈ క్రమంలో.. మరోసారి, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని అనుసరించి థర్డ్ ఎంపైర్ పరిశీలించగా... అవుట్‌సైడ్ ఇంపాక్ట్‌గా తేలింది. బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ స్టంప్స్ అవుట్‌సైడ్ లైన్‌లో ఉన్నట్లు కనిపించింది. దీంతో.. ఇంపాక్ట్ బీయింగ్ అవుట్‌సైట్ నిబంధన ప్రకారం.. తన నిర్ణయాన్ని మార్చుకుంటూ సూర్యను నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ ఎంపైర్. దీంతో దసున్ శనక సేన బిక్కముఖం వేసింది.
ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్..‘‘డీఆర్‌ఎస్ సమయంలో థర్డ్ ఎంపైర్ ఇదిలో ఇలాగే చేసి ఉంటాడు. ఇంకా నయం చివర్లో అయినా.. రైట్ కాల్ ఇచ్చాడు. థాంక్స్’’ అంటూ మీమ్‌ను షేర్ చేశాడు. ఇక భారత అభిమానులు సైతం.. ‘‘థర్డ్ అంపైర్ ఎందుకింత ఆలస్యం చేశాడు. ఒకసారి అవుట్, మరోసారి నాటౌట్.. ఏంటిది? వాళ్లకు అసలు రూల్స్ తెలియవా? ఆటగాళ్లకు డీఆర్‌ఎస్ గురించి తెలియదా. అయినా సూర్య నువ్వు ఎందుకు క్రీజు వదిలి వెళ్లాలనుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంపాక్ట్ అవుట్‌సైడ్ నిబంధన ప్రకారం.. లైన్‌కు ఆవల బంతి, బ్యాట్స్‌మెన్‌ను తాకినట్లయితే.. ఎల్బీడబ్ల్యూగా పరిగణించరు.
Third umpire during that DRS review 🤦 thankfully right call was made in the end. #SLvIND #SuryakumarYadav pic.twitter.com/bPOfoTJ6NA
— Wasim Jaffer (@WasimJaffer14) July 23, 2021