ఇస్లామాబాద్: టీమిండియా వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బద్దకస్తుడని, శ్రీలంక పర్యటనలో తను అవుట్ అయిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నాడు. లంక బౌలర్ వహిందు హసరంగ మాయాజాలంలో పడి తేలికగా వికెట్ సమర్పించుకున్నాడని విమర్శించాడు. కాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేతో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్ ఆ మ్యాచ్‌లో 46 పరుగులతో రాణించాడు. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 34 (27, 7,0) పరుగులు మాత్రమే చేశాడు.
తొలి, చివరి టీ20లో లంక బౌలర్ హసరంగ బౌలింగ్‌లోనే సంజూ పెవిలియన్ చేరడం గమనార్హం. అది కూడా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముఖ్యంగా మూడో టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘ నాకెందుకో సంజూ శాంసన్ బద్దకస్తుడైన బ్యాట్స్‌మెన్ అనిపిస్తుంది. ఒక బౌలర్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినపుడు.. తెలివిగా తప్పించుకోవాలి గానీ, అతడి వలకు చిక్కడం దేనికి? సంజూ శాంసన్ టెక్నిక్‌ను అంచనా వేసిన హసరంగ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
నిజానికి, జట్టులో ఉంది ఐదుగురు బ్యాట్స్‌మెన్లు. అందులో తను కూడా ఒకడని తెలుసు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ తను ఈ విషయాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అసలు అవుట్ కాకుండా ఉండేందుకు సంజూ ప్రయత్నించినట్లుగా ఏ కోశానా కనిపించలేదు’’ అని విమర్శించాడు. కాగా కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో ప్రధాన ఆటగాళ్లలో చాలా మంది అందుబాటులో లేకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment