'All is well': Sanju Samson reacts after being ruled out of Sri Lanka series - Sakshi
Sakshi News home page

లంకతో సిరీస్‌కు దూరమవడంపై స్పందించిన సంజూ.. ఏమన్నాడంటే..?

Published Fri, Jan 6 2023 9:50 AM | Last Updated on Fri, Jan 6 2023 10:04 AM

Sanju Samson Shared Message After Being Ruled Out Of SL Series - Sakshi

Sanju Samson: గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌ (టీ20) నుంచి మిడిల్‌ డ్రాప్‌ అయిన సంజూ శాంసన్‌ తొలిసారి స్పందించాడు. ఆల్‌ ఈజ్‌ వెల్‌.. సీ యూ సూన్‌  అంటూ ఇన్‌స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. సంజూ తన పోస్ట్‌లో తొలి టీ20 సందర్భంగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఫోటో షేర్‌ చేశాడు. సంజూ చేసిన ఈ పోస్ట్‌కు టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, వన్డే తాత్కాలిక సారధి శిఖర్‌ ధవన్‌ స్పందించారు.

హార్ధిక్‌.. హార్ట్‌ ఏమోజీతో రిప్లై ఇవ్వగా, ధవన్‌.. గెట్‌ వెల్‌ సూన్‌ బ్రో అంటూ బదులిచ్చాడు. సంజూ గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి బరిలోకి దిగాలని అతని అభిమానులు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. 

కాగా, లంకతో తొలి టీ20 సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ సంజూ శాంసన్‌ గాయపడిన విషయం తెలిసిందే. సంజూ గాయం తీవ్రమైంది కానప్పటికీ.. మున్ముందు జట్టు అవసరాల దృష్ట్యా బీసీసీఐ అతన్ని ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి విశ్రాంతినిచ్చింది.

బీసీసీఐ వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. సంజూ ఎడమ కాలి మోకాలి భాగంలో స్వల్ప గాయమైందని, కదలికలో సమస్య ఉన్నట్లు స్కాన్‌ రిపోర్ట్‌లో గుర్తించినందున కొద్దిరోజుల పాటు విశ్రాంతినివ్వాలని వారు బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బోర్డు తదనుగుణంగానే సంజూకు పాక్షికంగా విశ్రాంతి కల్పిస్తూ.. లంకతో మిగతా టీ20లకు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ జితేశ్‌ శర్మను ఎంపిక చేసింది. 

ఇదిలా ఉంటే, తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్‌.. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌.. శాంసన్‌ చెత్త షాట్‌ సెలెక్షన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్‌ ఆగ్రహానికి గురయ్యాడు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement