Ind Vs WI: Virat Kohli Record As Captain Double Century In Tests On This Day - Sakshi
Sakshi News home page

Virat Kohli: సరిగ్గా ఇదే రోజు.. విండీస్‌ గడ్డ మీద కోహ్లి డబుల్‌ సెంచరీ! అరుదైన రికార్డు.. కానీ ఇప్పుడు

Published Fri, Jul 22 2022 1:34 PM | Last Updated on Fri, Jul 22 2022 2:32 PM

Ind Vs WI: Virat Kohli Record As Captain Double Century In Tests On This Day - Sakshi

విరాట్‌ కోహ్లి(PC: Virat Kohli Twitter)

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఆతిథ్య జట్టుతో శుక్రవారం(జూలై 22) వన్డే సిరీస్‌ ఆరంభించనుంది. కాగా, ఇటీవల తరచుగా విఫలమవుతున్న భారత మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విండీస్‌ టూర్‌కు దూరమయ్యాడు.

ఫామ్‌లేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న అతడు ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. అయితే, ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విండీస్‌ గడ్డ మీద కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డ మీద టెస్టుల్లో ద్విశతకం సాధించిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.

ఆనాడు.. సరిగ్గా ఇదే రోజు..
2016లో కోహ్లి సేన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆంటిగ్వా వేదికగా సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియం వేదికగా.. జూలై 21న ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.

భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన మురళీ విజయ్‌(7) పూర్తిగా నిరాశ పరచగా మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 84 పరుగులతో రాణించాడు. ఇక నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా 67 బంతులు ఎదుర్కొని 16 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. 


PC: BCCI

కోహ్లి డబుల్‌ సెంచరీ.. అశ్విన్‌ విశ్వరూపం
ఈ క్రమంలో రెండో రోజు ఆట(జూలై 22)లో భాగంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 283 బంతులు ఎదుర్కొన్న అతడు 24 ఫోర్ల సాయంతో 200 పరుగులు చేశాడు. తద్వారా విదేశాల్లో టెస్టు ఫార్మాట్‌లో ద్విశతకం చేసిన టీమిండియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

ఇక కోహ్లి అద్బుత ఇన్నింగ్స్‌కు తోడు రవిచంద్రన్‌ అశ్విన్‌ 113 పరుగులు చేయగా.. అమిత్‌ మిశ్రా 53 పరుగులతో రాణించాడు. దీంతో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.  

ఆ తర్వాత విండీస్‌ 243 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ ముగించగా.. టీమిండియా ఫాలో ఆడించింది. ఈ క్రమంలో జేసన్‌ హోల్డర్‌ సారథ్యంలోని ఆతిథ్య వెస్టిండీస్‌ టీమిండియా చేతిలో 92 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.


PC:  Virat Kohli Twitter

సెంచరీతో పాటు.. 7 వికెట్లు కూల్చి విండీస్‌ పతనం శాసించిన అశ్విన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌ను కోహ్లి సేన 2-0తేడాతో సొంతం చేసుకుంది. మొదటి, మూడో టెస్టులు టీమిండియా గెలవగా.. రెండు, నాలుగు మ్యాచ్‌లను విండీస్‌ డ్రా చేసుకుంది. కాగా నాడు కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించిన కోహ్లి.. నేడు జట్టులో స్థానం కోల్పోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత కోహ్లిని మళ్లీ చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్‌! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement