
విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ
India tour of West Indies, 2023: దశాబ్దకాలంగా టీమిండియా ప్రధాన ఆటగాళ్లుగా కొనసాగుతూ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగులుస్తూ సంచలన రికార్డులు నమోదు చేశారు. అంతర్జాతీయ కెరీర్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకుని కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిస్తే.. 43 శతకాలు బాదిన రోహిత్ సైతం తన ప్రయాణంలో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు.
రోహిత్, కోహ్లి కాదు!
అయితే, విచిత్రంగా వెస్టిండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో వీరిద్దరిలో ఎవరూ టాప్‌లో లేకపోవడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023-23 సీజన్‌లో భాగంగా టీమిండియా విండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో డొమినికా వేదికగా బుధవారం మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో స్థాయికి తగ్గట్లు రాణించలేక కెప్టెన్ రోహిత్, కోహ్లి విఫలమైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో రోహిత్ 15, 43 పరుగులు చేయగా.. కోహ్లి 14, 49 రన్స్ సాధించాడు.
దీంతో వీరిద్దరు విండీస్‌తో టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ.. కోహ్లి, రోహిత్ కరేబియన్ జట్టుపై ఎన్ని సెంచరీలు సాధించారో తెలుసా? విరాట్ విండీస్‌తో ఇప్పటి వరకు 14 టెస్టులాడి కేవలం రెండు శతకాలు(ఐదు హాఫ్ సెంచరీలు) బాదగా.. 4 మ్యాచ్‌లలో రోహిత్ రెండు సెంచరీలు సాధించాడు.
అస్సలు ఊహించలేరు
ఇక టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వెస్టిండీస్‌పై నాలుగు సెంచరీలతో వీరిద్దరి కంటే ముందు వరుసలో నిలవడం విశేషం. 11 మ్యాచ్‌లలో అశూ 50.18 సగటుతో 552 పరుగులు సాధించాడు. తద్వారా యాక్టివ్ క్రికెటర్లలో స్టార్ బ్యాటర్లైన కోహ్లి, రోహిత్‌లను వెనక్కినెట్టి అగ్రస్థానం ఆక్రమించాడు.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ
Comments
Please login to add a commentAdd a comment