
India tour of West Indies, 2023: ‘‘ఈ ప్రశ్నకు ఇప్పటికే నేను చాలాసార్లు సమాధానం చెప్పాను. బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా మాకు అనవసరం. ఎవరు ఎంత స్కోర్ చేశారు..? ఎవరు ఎన్ని వికెట్లు తీశారు? అని మాట్లాడుతూ ఉంటారు. అయితే, జట్టులో అంతర్గతంగా ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు. అయినా బయటివాళ్లు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు.
మాకు మాత్రం జట్టు లోపల ఏం జరుగుతుందన్నదే ముఖ్యం. మ్యాచ్‌లు గెలవడంపైనే మా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అంతేగానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారన్న విషయాలను మేము పట్టించుకోము. అసలు అదంతా మాకు లెక్కేకాదు’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిపోర్టర్‌కు ఘాటు కౌంటర్ ఇచ్చాడు.
మా దృష్టి మొత్తం దానిమీదే
ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టామని.. ఇతర విషయాల గురించి ఆలోచించే సమయం లేదని స్పష్టం చేశాడు. కాగా భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టులో అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ సెంచరీలు చేయగా.. రెండో టెస్టులో విరాట్ కోహ్లి శతకం బాదాడు.
ఐదేళ్ల తర్వాత కోహ్లి ‘సెంచరీ’
ట్రినిడాడ్‌లో తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి మధుర జ్ఞాపకం మిగిల్చుకున్నాడు. తద్వారా విదేశీ గడ్డపై దాదాపు ఐదేళ్ల తర్వాత కోహ్లి టెస్టుల్లో మూడంకెల మార్కును అందుకోవడం విశేషం. చివరగా పెర్త్‌లో అతడు శతకం సాధించాడు.
ఇదిలా ఉంటే.. కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా గత మూడేళ్లలో గడ్డుకాలం ఎదుర్కొన్న కోహ్లి.. దాదాపు వెయ్యి రోజుల నిరీక్షణ తర్వాత కోహ్లి ఆసియా కప్-2022 సందర్భంగా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత వరుసగా బిగ్ స్కోర్లు సాధిస్తూ అంతర్జాతీయ కెరీర్‌లో 76వ శతకం అందుకున్నాడు.
ఎన్నిసార్లు చెప్పాలి?
ఈ నేపథ్యంలో కోహ్లి కెరీర్‌లో ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూ.. కోహ్లి లాంటి స్టార్ బ్యాటర్ విదేశాల్లో అడపాదడపా సెంచరీలు చేయడం జట్టును ఆందోళనకు గురిచేస్తోందా అని ఓ విలేకరి రోహిత్ శర్మను ప్రశ్నించారు. విండీస్‌తో గురువారం తొలి వన్డే ఆరంభం కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అతడికి ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రోహిత్ పైవిధంగా స్పందించడం గమనార్హం.
చదవండి: జైశ్వాల్‌కు ఆమాత్రం ఓపిక లేకుంటే ఎట్లా? అనవసరంగా: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment