జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జట్టును వంద పరుగుల తేడాతో మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
దెబ్బకు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఖాతాలో కెప్టెన్‌గా తొలి విజయం నమోదైంది.
దుమ్ములేపిన అభిషేక్.. రాణించిన రుతురాజ్
హరారే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.
తొలి టీ20లో విఫలమైన ఈ పంజాబీ బ్యాటర్ తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసి తన విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అభిషేక్ శర్మకు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థశతకం (47 బంతుల్లో 77 పరుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 పరుగులు నాటౌట్, ఫోర్లు 2, సిక్సర్లు 5) రుతురాజ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత జట్టు కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 234 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
జోరుగా హుషారుగా వికెట్లు...
ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (4)ను ముకేష్‌కుమార్ ఆదిలోనే వెనక్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ వెస్లే మెదెవెరె(43), వన్‌డౌన్ బ్యాటర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలికగా తలొగ్గలేదు.
బ్యానెట్‌ను ముకేష్‌కుమార్ ఔట్ చేయగా.. రవి బిష్ణోయ్ వెస్లే పని పట్టాడు. ఇదే జోరును భారత బౌలర్లు కొనసాగించడంతో జింబాబ్వే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఈక్రమంలో లోయర్ ఆర్డర్‌లో వచ్చిన ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బకు అతడుకూడా పెవిలియన్ చేరక తప్పలేదు.
ఈక్రమంలో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.
టీమిండియా బౌలర్లలో ముకేష్‌కుమార్, ఆవేశ్‌ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. రవి బిష్ణోయ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment