జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రింకూ.. భారత్ తరఫున టీ20ల్లో చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు (18) బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.
ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (32 సిక్సర్లు) టాప్‌లో ఉండగా.. విరాట్ (24), ధోని (19) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 32 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు హార్దిక్‌కు 193 బంతులు, 24 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లికి 158 బంతులు, 19 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు ధోనికి 258 బంతులు అవసరం కాగా.. రింకూ కేవలం 48 బంతుల్లోనే 18 సిక్సర్ల మార్కును తాకాడు. రింకూ కెరీర్‌లో చివరి రెండు ఓవర్లలో 334.69 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం గమనార్హం.
తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు (13 ఇన్నింగ్స్‌లు) 25 సిక్సర్లు బాదిన రింకూ.. 178.76 స్ట్రయిక్‌రేట్‌తో 80.8 సగటున 404 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో కనీసం 15 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. రింకూ తన టీ20 కెరీర్‌లో చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయ.
38(21), 37*(15), 22*(14), 31*(9), 46(29), 6(8), 68*(39), 14(10), 16*(9), 9*(9), 69*(39), 0(2), 48*(22)
🚨 WHAT A SHOT, RINKU 🚨 pic.twitter.com/gNZKRjAYZ9
— Johns. (@CricCrazyJohns) July 7, 2024
జింబాబ్వేతో రెండో టీ20లో 15వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ.. తొలి 14 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన రింకూ.. 8 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాది టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రింకూ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం బయటపడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment