రింకూ, సూర్యకుమార్‌ అద్భుత బౌలింగ్‌.. సూపర్‌ ఓవర్‌లో లంకను చిత్తు చేసిన భారత్‌ | SL VS IND 3rd T20: Surya Kumar Yadav And Rinku Singh Superb Bowling Takes The Match To Level The Scores | Sakshi
Sakshi News home page

SL VS IND 3rd T20: రింకూ, సూర్యకుమార్‌ "సూపర్‌" బౌలింగ్‌

Published Wed, Jul 31 2024 7:03 AM | Last Updated on Wed, Jul 31 2024 9:02 AM

SL VS IND 3rd T20: Surya Kumar Yadav And Rinku Singh Superb Bowling Takes The Match To Level The Scores

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. పార్ట్‌ టైమ్‌ బౌలర్ల అయిన రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను 'టై' చేశారు. అనంతరం సూపర్‌ ఓవర్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. చివరి ఏడు వికెట్లను 22 పరుగుల వ్యవధిలో (4.2 ఓవర్లలో) కోల్పోయింది. 19వ ఓవర్‌ వేసిన రింకూ సింగ్‌ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా.. 20వ ఓవర్‌ వేసిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ, స్కై సూపర్‌ బౌలింగ్‌తో చెలరేగడంతో మ్యాచ్‌ 'టై'గా మారి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్‌ ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్‌ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఓడాల్సిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్‌ టైమ్‌ బౌలర్లు రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. 

నిజమైన మ్యాచ్‌ విన్నర్‌ అంటూ కొనియాడుతున్నారు. సూపర్‌ ఓవర్‌ వేసిన సుందర్‌పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్‌ ఓవర్‌లో అద్బుతంగా బౌలింగ్‌ చేశాడంటూ నెటిజన్లు కితాబునిస్తున్నారు. రెగ్యులర్‌ మ్యాచ్‌లో రెండు, సూపర్‌ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు లభించింది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (39), రియాన్‌ పరాగ్‌ (26), సుందర్‌ (25) ఓ మోస్తరు పరుగులు చేశారు. లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్‌ మెండిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలో గెలుపు దిశగా పయనించినప్పటికీ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు నిస్సంక (26), కుశాల్‌ మెండిస్‌ (43), వన్‌డౌన్‌ బ్యాటర్‌ (46) ఓ మోస్తరు స్కోర్లు చేసినా ప్రయోజనం​ లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లంతా కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సుందర్‌, బిష్ణోయ్‌, రింకూ సింగ్‌, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement