
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్ గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను ఢీకొట్టి మరీ శుభారంభం చేసింది. ఇప్పుడు సులువైన జట్టు అఫ్గానిస్తాన్‌తో పోరుకు సై అంటోంది. పదునెక్కిన బౌలింగ్‌తో ‘కంగారు’ పెట్టించిన భారత్ ఇప్పుడు టాపార్డర్ ఫామ్‌పై దృష్టి పెట్టింది. అనుభవజ్ఞుడైన కెపె్టన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల డకౌట్లు జట్టు మేనేజ్‌మెంట్‌ను కాస్త కలవరపెట్టినా... ఇప్పుడు అఫ్గాన్‌తో పరుగుల వరద పారించి ఫామ్‌లోకి వచ్చే అవకాశం లభించింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోకు విలవిలలాడిన అఫ్గానిస్తాన్ పటిష్టమైన రోహిత్ సేనకు ఏ మేరకు బదులిస్తుందో చూడాలి.
ఆసీస్‌తో టాపార్డర్ మాత్రమే తడబడింది. కేఎల్ రాహుల్, కోహ్లిల సూపర్ ఇన్నింగ్స్‌లతో మాజీ చాంపియన్‌ను మట్టికరిపించింది. అది చెపాక్ పిచ్ అయితే... ప్రత్యర్థి ఆ్రస్టేలియా. కానీ ఇప్పుడు ఎదురవుతోంది మాత్రం అఫ్గాన్, తలపడుతోంది ఢిల్లీలో... కాబట్టి పరుగుల వరద గ్యారంటీ! ఇందులో సందేహమే లేదు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 400 పైచిలుకు పరుగులు చేస్తే లక్ష్యఛేదనలో శ్రీలంక 300 పైచిలుకు చేసింది.
ఇప్పుడు రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యాలాంటి మేటి బ్యాటర్లున్న భారత్ ప్రేక్షకులను భారీ షాట్లతో అలరించడం ఖాయం. డెంగీ జ్వరం నుంచి శుబ్‌మన్ గిల్ కోలుకోకపోవడంతో తుది జట్టులో ఏమార్పు ఉండకపోవచ్చు. మరోవైపు అఫ్గానిస్తాన్ రాటుదేలినా... మెగా ఈవెంట్ ఒత్తిడిని తట్టుకొని భారత్‌ను కంగుతినిపించే సత్తా అయితే లేదనే చెప్పాలి. ఇలా ఏ రకంగా చూసినా కూడా ఢిల్లీలో ఏకపక్షమయ్యే మ్యాచే జరుగుతుందనడంలో సందేహమే లేదు.