జోరు మీదున్న రోహిత్ బృందం
నిలకడలేమితో బట్లర్ జట్టు
రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
టీమిండియా ఏడు నెలల్లో మరో ప్రపంచకప్ ఫైనల్‌పై గురి పెట్టింది. 2022 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తమను ఓడించి తుది పోరుకు అర్హత పొందిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై బదులు తీర్చుకునేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది.
‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లు ఈ ఒక్క నాకౌట్ విజయంతో ఇంగ్లండ్ ను కసిదీరా ఇంటికి పంపొచ్చు... మనమేమో 10 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో మరోసారి ఫైనల్ చేరవచ్చు. బ్యాటింగ్ ఫామ్, బౌలింగ్ నిలకడ భారత్‌ను ఓ మెట్టుపైనే నిలబెడుతోంది.
జార్జ్‌టౌన్: భారత్ ఇక అసలైన పోరుకు సిద్ధమైంది. గడిచిన 26 రోజులుగా ఆడిన మ్యాచ్‌లు వేరు, నేటి సెమీఫైనల్ పోరాటం వేరు. లీగ్, సూపర్–8 దశలు కావడంతో ఇన్నాళ్లూ కచ్చితంగా గెలవకపోయినా... ముందుకెళ్లే అవకాశమైతే ఉండింది. కానీ ఇది నాకౌట్ పోరు. అన్నీ గెలిచామన్న ధీమా కుదరదు. అలాగే ఇదీ గెలుస్తామన్న గ్యారంటీ లేదు.
ఇంకా చెప్పాలంటే కప్ గెలవాలన్నా... ఆఖరి మెట్టుపై నిలవాలన్నా... ఈ రెండో మెట్టే గట్టిగా వేయాలి. లేదంటే అమీతుమీకి ముందే మన జైత్రయాత్రకు చెక్ పడుతుంది. పైగా ఇది టి20 ఫార్మాట్. ఈ మెరుపుల ఫార్మాట్‌ను బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లే కాదు... వరుణ దేవుడు కూడా శాసిస్తోంది. ఇది ఒక్కోసారి పెద్ద జట్లకు శాపంగా... ఉన్నపళంగా జఠిలంగా కూడా మారుతోంది.
ఏడు జట్లను ఓడించాం కానీ...
ఒక వార్మప్ మినహాయిస్తే... నాలుగు లీగ్ దశ పోటీలు, మూడు సూపర్–8 మ్యాచ్‌ల్లో ఏడు వేర్వేరు జట్లనైతే ఓడించాం. కానీ గట్టిగా జయించింది ఇద్దరినే! లీగ్ దశలో పాకిస్తాన్, ‘సూపర్–8’లో ఆ్రస్టేలియా ఈ రెండు మేటి జట్లపై గెలుపే ప్రపంచకప్ స్థాయి గెలుపని చెప్పొచ్చు.
ఐర్లాండ్, అమెరికా, కెనడా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించడం టీమిండియా స్థాయికి ఏమాత్రం విషయం కానేకాదు. ఆ్రస్టేలియా లాంటి మేటి జట్టుపై కెపె్టన్ రోహిత్ శర్మ విధ్వంసం భారత బ్యాటింగ్‌ను మరోస్థాయిలో నిలబెడుతోంది. కానీ విరాట్ కోహ్లి వైఫల్యమే జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
బహుశా ఈ సెమీస్‌లో ఆ కరువు తీర్చు కుంటే అభిమానులకు ‘ఫైనల్ పండగే’ మిగులుతుంది. సూర్యకుమార్, దూబే, హార్దిక్ పాండ్యాలు దంచేయడం, బౌలింగ్‌లో బుమ్రాతో పాటు అర్‡్షదీప్ నిప్పులు చెరుగుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్‌లు కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు.
తడబడుతూ ఇంగ్లండ్
డిఫెండింగ్ చాంపియన్ హోదాతో మెగా ఈవెంట్ ను మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఇక్కడిదాకా వచ్చేందుకు తడబడింది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడింది కూడా! కానీ ఏ జట్టుపై, ఏ వేదికపై సాధికారికంగా ఆడిన దాఖలాలైతే లేవు.
అయితే అసలైన ఈ నాకౌట్ సమరంలో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్‌లు బ్యాట్ ఝుళిపిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు తప్పవేమో! బౌలింగ్‌లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ అద్భుతంగా రాణిస్తుండటం ప్రత్యర్థి బౌలింగ్ దళానికి బలంగా మారింది.
23 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 23 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. 12 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు తలపడగా... చెరో రెండు విజయాలతో సమంగా ఉన్నాయి.
వర్షార్పణమైతే..
గయానాలో బుధవారం వాన కురిసింది. మ్యాచ్‌కు వరుణ గండమైతే ఉంది. తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. భారీ వర్షంతో సెమీఫైనల్స్ రద్దయితే లీగ్, సూపర్–8 దశల్లో టాపర్‌గా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ చేరుతాయి.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్ ), కోహ్లి, సూర్యకుమార్, రిషభ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్‡్షదీప్, బుమ్రా.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, టాప్లీ.
పిచ్, వాతావరణం
గయానా పిచ్ బౌలర్లకు స్వర్గధామం. ఈ వేదికపై తొలుత బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 127. అయితే లక్ష్యఛేదన మరీ దారుణం. సగటు స్కోరు 95 పరుగులే! కాబట్టి మెరుపుల్ని ఆశించడం అత్యాశే! మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment