Asia Cup 2022 IND VS AFG: ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత్ ఆఖరి పోరుకు ముందే నిష్క్రమణకు సిద్ధమైంది. సూపర్–4లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య నేడు నామమాత్రమైన మ్యాచ్ జరుగుతుంది. రెండేసి విజయాలతో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరడంతో గురువారం జరిగే మ్యాచ్ ఆడి రావడం తప్ప టీమిండియా, అఫ్గానిస్తాన్‌లకు యూఏఈలో ఇక ఏం మిగల్లేదు.
ఒత్తిడిలో భారత్
ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఫైనల్‌కు వెళ్లలేని స్థితిలో ఉన్న భారత్ ఒత్తిడిలో కూరుకుపోయింది. గ్రూప్ దశలో బాగున్న పరిస్థితి ‘సూపర్–4’కు వచ్చేసరికి మారిపోయింది. ఓపెనింగ్‌లో రాహుల్, మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌ల ప్రదర్శన భారత మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై టి20 ప్రపంచకప్ ఆడాల్సిన జట్టు ఇది కాదేమోనన్న సందేహాన్ని రేకెత్తిస్తోంది.
హిట్టర్లుగా ముద్రపడిన రాహుల్, పాండ్యా, పంత్‌లు పాక్, శ్రీలంకలతో జరిగిన పోటీల్లో ఆడినట్లుగా లేదు. అదేదో సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లా తేలిగ్గా తీసుకున్నారు. ఇక బౌలింగ్ విభాగం కూడా తీసికట్టుగానే ఉంది. అనుభవజ్ఞుడైన సీమర్ భువనేశ్వర్, స్పిన్నర్లు చహల్, అశ్విన్ ఇలా ఎవరూ మ్యాచ్‌ను మలుపుతిప్పే వికెట్లే తీయలేదు. ఇది హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు కూర్పుపై చేస్తున్న కసరత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment