టీమిండియాతో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించిన జద్రాన్‌ బృందం | Ind Vs Afg 1st T20I: Afghanistan Highest Score Against India Breaks Record | Sakshi
Sakshi News home page

Ind Vs Afg: టీమిండియాతో మ్యాచ్‌.. అఫ్గనిస్తాన్‌ నయా రికార్డు

Published Thu, Jan 11 2024 9:33 PM | Last Updated on Thu, Jan 11 2024 9:37 PM

Ind Vs Afg 1st T20I: Afghanistan Highest Score Against India Breaks Record - Sakshi

టీమిండియాతో తొలి టీ20లో అఫ్గనిస్తాన్‌ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టుపై పొట్టి ఫార్మాట్లో తమకున్న రికార్డును జద్రాన్‌ బృందం తాజాగా బ్రేక్‌ చేసింది.

టీ20 సిరీస్‌ ఆడేందుకు తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న అఫ్గనిస్తాన్‌కు 22 ఏళ్ల బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వెన్నునొప్పి సర్జరీ కారణంగా ఆటకు దూరం కాగా.. అతడి స్థానంలో జద్రాన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

ఈ క్రమంలో మొహాలీ వేదికగా మొదటి టీ20లో టాస్‌ ఓడిన అఫ్గనిస్తాన్‌ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌(23), ఇబ్రహీం జద్రాన్‌(25) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 29 పరుగులతో రాణించాడు.

అరంగేట్ర ప్లేయర్‌ రహ్మత్‌ షా(3) విఫలం కాగా.. మహ్మద్‌ నబీ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో నజీబుల్లా 11 బంతుల్లో 19, కరీం జనత్‌ 5 బంతుల్లో 9 పరుగులతో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో అఫ్గన్‌ 158 పరుగులు స్కోరు చేయగలిగింది.

టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. శివం దూబే ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. రవి బిష్ణోయి 3 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. 

ఇదిలా ఉంటే.. టీమిండియాపై టీ20లలో అఫ్గనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టీ20 వరల్డ్‌కప్‌-2021లో భాగంగా అబుదాబిలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గన్‌ ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తాజాగా జద్రాన్‌ బృందం ఆ రికార్డును తిరగరాసి చరిత్ర సృష్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement