Ind vs Afg: రీఎంట్రీలో రోహిత్‌ డకౌట్‌! తప్పు తనదే అయినా.. | Ind vs Afg 1st T20I: After 14 Months Return Rohit Run Out Duck Fans Reacts | Sakshi
Sakshi News home page

Rohit Sharma: రీఎంట్రీలో రోహిత్‌ డకౌట్‌.. మరీ ఘోరంగా..! తప్పు తనదే అయినా..

Published Thu, Jan 11 2024 8:57 PM | Last Updated on Fri, Jan 12 2024 2:41 PM

Ind vs Afg 1st T20I: After 14 Months Return Rohit Run Out Duck Fans Reacts - Sakshi

Ind vs Afg 1st T20I Rohit Sharma Duck Out: అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు.

పరుగుల ఖాతా తెరవకుండానే సున్నా చుట్టి నిష్క్రమించాడు. దీంతో టీమిండియా తరఫున రీఎంట్రీలో రోహిత్‌ బ్యాటింగ్‌ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.  హిట్‌మ్యాన్‌ సైతం ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్‌ చేరాడు.  ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్‌ శర్మ పేరు వైరల్‌గా మారింది. 

ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో పాపం.. రోహిత్‌ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్‌.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్‌ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది.

ఫజల్‌హక్‌ ఫారూకీ బౌలింగ్‌లో రోహిత్‌ మిడాఫ్‌ దిశగా షాట్‌కి యత్నించాడు. ఈ క్రమంలో పరుగు తీసేందుకు వెళ్లగా గిల్‌తో సమన్వయలోపం ఏర్పడింది. అప్పటికే అద్భుతరీతిలో డైవ్‌ చేసిన అఫ్గన్‌ కెపెన్‌ జద్రాన్‌ బంతి దాటిపోకుండా ఆపేశాడు.

కానీ అప్పటికే క్రీజు వీడిన రోహిత్‌.. గిల్‌ను రమ్మని పిలవగా బంతిని ఫీల్డర్‌ అందు​కోవడం చూసిన అతడు అక్కడే ఉండిపోయాడు. అయితే, తాను అవుట్‌ కావడంతో రోహిత్‌ శర్మ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.మరోవైపు.. జద్రాన్‌, వికెట్‌ కీపర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ కలిసి రోహిత్‌ రనౌట్‌లో పాలుపంచుకున్నారు. బిగ్‌వికెట్‌ దక్కడంతో అఫ్గన్‌ సంబరాలు అంబరాన్నంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement