వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి.. టీమిండియా చేసిన తప్పులు ఇవే? | India vs Australia CWC 2023 final: 5 reasons why India lost the match | Sakshi
Sakshi News home page

CWC 2023 final: వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి.. టీమిండియా చేసిన తప్పులు ఇవే?

Published Mon, Nov 20 2023 5:13 PM | Last Updated on Mon, Nov 20 2023 7:51 PM

India vs Australia CWC 2023 final: 5 reasons why India lost the match - Sakshi

ఒకే ఒక్క మ్యాచ్‌.. కోట్ల మంది భారత  అభిమానుల గుండె పగిలేలా చేసింది. ఒకే ఒక్క మ్యాచ్‌.. సొంత గడ్డపై మూడోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడాలన్న టీమిండియా ఆశలను అడియాశలు చేసింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. కీలకమైన ఫైనల్లో మాత్రం కంగారుల ముందు చేతులేత్తేసింది. 

తుది పోరులో అన్ని విభాగాల్లో విఫలమైన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాకు మరోసారి వరల్డ్‌కప్‌ను అప్పగించింది. కాగా ఫైనల్‌ వరకు అజేయ జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై ఎందుకు బోల్తా పడింది? అందుకు కారణాలు ఏంటి?

బ్యాటింగ్‌ వైఫల్యం..
టీమిండియా ఓటమికి ప్రాధాన కారణం బ్యాటింగ్‌ వైఫల్యం. ఈ నిజాన్ని మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం అంగీకరించాడు. ఆసీస్‌ కెప్టెన్‌ టాస్‌ గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తూ భారత జట్టును తొలుత బ్యాటింగ్‌కు​ ఆహ్హనించాడు. అదేంటి బ్యాటింగ్‌ అనుకూలించే వికెట్‌పై కమ్మిన్స్‌ బ్యాటింగ్‌ తీసుకున్నాడేంటని తెగ చర్చనడిచింది. 

హమ్మయ్య టీమిండియా తొలుత బ్యాటింగ్‌.. ఇక వరల్డ్‌కప్‌ మనదే అని అంతా ఫిక్స్‌ అయిపోయారు. రోహిత్‌ సైతం తాము మొదట బ్యాటింగే చేయాలనకుంటున్నట్లు టాస్‌  సందర్భంగా తెలిపాడు. కానీ మ్యాచ్‌ సగంలోనే ఆర్ధమైంది కమ్మిన్స్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే అని. 

ఇన్నింగ్స్‌ ఆర​ంభంలోనే భారత్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతున్నానని మర్చిపోయిన యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. చెత్త షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. అనంతరం కాసేపు అలరించిన రోహిత్‌ శర్మ కూడా అనవసరపు షాట్‌ ఆడి పెవిలియన్‌కు చేరాడు. కీలక సమయంలో క్రీజులో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ సైతం కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

ఈ సమయంలో విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే చేశారు. అయితే విరాట్‌, రాహుల్‌ను జట్టును ముందుకు నడిపించినప్పటికి.. పూర్తిగా డిఫెన్సివ్‌ మైండ్‌ సెట్‌లోకి వెళ్లిపోయారు. దీంతో స్కోరింగ్‌ రేట్‌ పూర్తిగా పడిపోయింది. మిడిల్‌ ఓవర్లలో అస్సలు వీరిద్దరూ బ్యాట్‌ నుంచి బౌండరీలు కరవైపోయాయి.  

ఈ క్రమంలో విరాట్‌ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా సైతం జట్టును ఆదుకోలేకపోయాడు. రాహుల్‌  బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేకపోయాడు. 107 బంతులు ఆడిన రాహుల్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఉంది.

ఇక్కడే మనకు అర్ధమవుతోంది. మిడిల్‌ ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్‌ తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆఖరిలో సూర్యకుమార్‌ యాదవ్‌ అయినా మెరుపులు మెరిపిస్తుండనుకుంటే తుస్సుమన్పించాడు. 28 బంతుల్లో 18 పరుగులు చేసి ఓ చెత్త షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయింది. రాహుల్‌-కోహ్లి భాగస్వామ్యం మినహా భారత బ్యాటింగ్‌లో చెప్పకొదగ్గ పార్టనర్‌ షిఫ్‌ లేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 240 పరుగులకే చాపచుట్టుసేంది. 

చెత్త ఫీల్డింగ్‌.. 
టోర్నీ ఆరంభం నుంచి అద్బుతమైన ఫీల్డింగ్‌ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం చేతేలేస్తేంది. తొలుత ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌లో 20-25 పరుగులు కాపాడుకోగల్గితే.. భారత్‌ అందుకు భిన్నంగా అదనపు పరుగులు సమర్పించకుంది. ఫీల్డ్‌లో చాలా బద్దకంగా వ్యవహరించారు. ఒక పరుగు రావల్సిన చోట మరో అదనపు ఇచ్చి ఆసీస్‌ బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా లేకుండా చేశారు. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా సంప్ట్స్‌ వెనుక పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఇక భారత్‌ ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు డైవ్‌ చేయడం కూడా మర్చిపోయారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మొత్తంలో డైవ్‌ చేసిన సందర్భాలు కేవలం ఒకట్రెండు ఉంటాయి. 

ఎక్స్‌ట్రాస్‌.. 
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతీ పరుగు చాలా ముఖ్యం. అటువంటిది భారత్‌ బౌలర్లు ఏకంగా 18 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా మొత్తం 50 ఓవర్లలో 12 ఎక్స్‌ట్రాస్‌ ఇస్తే.. టీమిండియా 43 ఓవర్లలో 18 ఎక్స్‌ట్రాస్‌ సమర్పించుకుంది. ఇందులో 9 పరుగులు వైడ్‌ల రూపంలో వచ్చినివి. 

స్పిన్నర్లు విఫలం..
ఫైనల్‌ పోరులో టీమిండియా పేసర్లు కాస్త పర్వాలేదన్పించనప్పటికీ స్పిన్నర్లు మాత్రం విఫలమయ్యారు. కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. వికెట్‌ మాట పక్కన పడితే బ్యాటర్లను కొంచెం కట్టడి చేయలేకపోయారు. జడేజా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిస్తే.. కుల్దీప్‌ 56 పరుగులు సమర్పించుకున్నాడు.

హెడ్‌ అద్బుత పోరాటం..
241 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. మనకంటే ఆసీస్‌కు చెత్త ఆరంభం లభించింది. మనం 10.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేస్తే.. ఆసీస్‌ 6.6 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ తన శైలికి భిన్నంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ఎప్పుడైతే క్రీజులో నిలదొక్కుకున్నాడననే భారత బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చివరి వరకు అద్బుతంగా ఆడిన హెడ్‌ (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. అతడితో పాటు మార్నస్‌ లబుషేన్‌ (58 నాటౌట్‌) పరుగులతో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement