బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా క్వీన్స్‌లాండ్ రాజధాని బ్రిస్బేన్‌లో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ హోటల్‌లో పనిచేసే క్లీనర్‌కు యూకే కోవిడ్ స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా బ్రిస్బేన్‌లో అక్కడ మూడు రోజులపాటు కఠినతరమైన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జనవరి 15న మొదలుకానున్న నాలుగో టెస్టు వేదికపై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బ్రిస్బేన్‌లో ఆఖరి టెస్టును నిర్వహించాల్సి ఉంది.
అయితే అక్కడ కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో.. మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కొంతమంది హెచ్చరించినట్లు కూడా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా గానీ, బీసీసీఐ గానీ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక తాజాగా బ్రిస్బేన్‌లో 3 రోజుల లాక్‌డౌన్ విధించడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. గబ్బాలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధంగాలేరని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ప్రకటన వెలువడటం గందరగోళానికి కారణమవుతోందంటూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. (చదవండి: నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్)
అదే విధంగా సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది. కాగా బ్రిస్బేన్ క్వారంటైన్ నిబంధనల సడలింపు గురించి బీసీసీఐ గురువారమే సీఏకు లేఖరాసిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఆతిథ్య క్రికెట్ బోర్డు.. హోటల్ రూం నుంచి బయటికి వచ్చి ఇతర ఆటగాళ్లతో సమయం గడిపేందుకు అవకాశం ఇస్తామని మౌఖిక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పర్యాటక జట్టు మాత్రం రాతపూర్వకంగా హామీ ఇస్తేనే బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు అంగీకరిస్తామని షరతు విధించినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.(చదవండి: దెబ్బలే దెబ్బలు.. ఇంప్రెస్ అయ్యాను)
Comments
Please login to add a commentAdd a comment