వన్డే ప్రపంచకప్-2023లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్డేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ జట్లు వన్డే ప్రపంచకప్‌లో తొలిసారిగా ఎప్పుడు తలపడ్డాయి? ఎవరిది పైచేయి వంటి విషయాలపై ఓ లూక్కేద్దం.
భారత్‌దే పైచేయి..
వన్డే వరల్డ్‌కప్‌లో చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జట్టు పాకిస్తాన్ చేతిలో ఓటమి చెందలేదు. వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటవరకు ఇరు జట్లు 7 సార్లు ముఖాముఖి తలపడగా.. టీమిండియానే 7 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు ఎనిమిదో సారి కూడా పాకిస్తాన్‌ను చిత్తు చేయాలని భారత జట్టు వ్యూహాలు రచిస్తోంది.
తొలిసారి ఎప్పుడంటే?
1992లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ కప్‌లో తొలిసారి పాక్-భారత జట్లు ముఖాముఖి తలపడ్డాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను భారత్ చిత్తుచేసింది. భారత జట్టుకు మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం వహించగా.. పాక్ జట్టుకు ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 216 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (62 బంతుల్లో 54 పరుగులు), అజయ్ జడేజా 77 బంతుల్లో (46 పరుగులు)చేశారు. అనంతరం 217 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 173 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్,జవగల్ శ్రీనాథ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చివరసారి ఎప్పుడంటే?
చివరగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2019లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ(140) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 89 పరుగుల తేడాతో టీమిండియా విజయం గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment