Ind Vs Sa 3rd Test: వరుసగా రెండో టెస్టులోనూ బ్యాటింగ్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. టాస్ గెలిచిన సానుకూలతను పూర్తి స్థాయిలో వాడుకోలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. దాంతో మరోసారి జట్టును రక్షించాల్సిన భారం బౌలర్లపైనే పడింది. ఆట ముగిసేలోగా గత మ్యాచ్ హీరో ఎల్గర్ వికెట్ తీయడం కాస్త సంతృప్తినిచ్చినా ఓవరాల్‌గా తొలి రోజు సఫారీలదే.
అయితే మంగళవారం ఆటలో భారత కెప్టెన్ కోహ్లి ప్రదర్శనే చెప్పుకోదగ్గ అంశం. ఆరంభంలో ఓపిగ్గా క్రీజ్‌లో నిలబడిన అతను, ఆ తర్వాత తన స్థాయికి తగిన రీతిలో చక్కటి షాట్లతో అలరించాడు. కోహ్లి బ్యాటింగ్ చూస్తే రెండేళ్ల తర్వాత అతని నుంచి అంతర్జాతీయ సెంచరీ రావడం ఖాయమనిపించింది. దురదృష్టవశాత్తూ మళ్లీ ఆ అవకాశం చేజారినా, కోహ్లి బ్యాటింగ్ వల్లే టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండో రోజు ఆతిథ్య జట్టును మన బౌలర్లు ఎలా నిలువరిస్తారనేదే కీలకం.
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టెస్టులో మొదటి రోజు భారత బ్యాటర్లు ఆశించిన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. సఫారీ బౌలర్లు రాణించడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (201 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 43; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
రబడ 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా అవుట్ చేయగా... మార్క్‌రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో దిగింది. విహారి స్థానంలో కోహ్లి... సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ వచ్చారు.
రాణించిన పుజారా...
భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) ఈసారి మెరుగైన ఆరంభాన్ని అందించడంలో విఫలమయ్యారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ దశలో పుజారా, కోహ్లి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ పరిస్థితిని చక్కదిద్దారు. ఆశ్చర్యకరంగా పుజారా ధాటిని ప్రదర్శించగా, కోహ్లి అతి జాగ్రత్తగా ఆడాడు. పరిస్థితులు ఎలా ఉన్నా గట్టిగా క్రీజ్‌లో నిలవాలనే పట్టుదల కోహ్లిలో కనిపించింది. తాను ఆడిన 16వ బంతికి గానీ అతను ఖాతా తెరవలేదు.
చక్కటి బంతితో పుజారాను అవుట్ చేసి జాన్సెన్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించగా పుజారానే 41 పరుగులు చేయడం విశేషం. పుజారా అవుటయ్యే సమయానికి కోహ్లి 80 బంతుల్లో 17 పరుగులే చేశాడు! ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే (9) విఫలమయ్యాడు.
కోహ్లీ మరీ నెమ్మదిగా...
అయితే వరుసగా రెండు వికెట్లు పడిన తర్వాత విరాట్ తనదైన శైలిలో బాధ్యత తీసుకొని చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అతని అందమైన కవర్ డ్రైవ్‌లు ఆటలో హైలైట్‌గా నిలిచాయి. 158 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. కోహ్లి, రిషభ్ పంత్ (50 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఐదో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతుండటంతో చకచకా ఆడి పరుగులు రాబట్టే ప్రయత్నం చేసిన కోహ్లి అర్ధ సెంచరీ దాటిన తర్వాతే ఐదు బౌండరీలు కొట్టాడు. సహచరులు అండగా నిలిస్తే శతకం ఖాయమని అనిపించినా... రబడ వేసిన ఒక చక్కటి బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఆట ముగిసింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) వెరీన్ (బి) ఒలీవియర్ 12; మయాంక్ (సి) మార్క్‌రమ్ (బి) రబడ 15; పుజారా (సి) వెరీన్ (బి) జాన్సెన్ 43; కోహ్లి (సి) వెరీన్ (బి) రబడ 79; రహానే (సి) వెరీన్ (బి) రబడ 9; పంత్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 27; అశ్విన్ (సి) వెరీన్ (బి) జాన్సెన్ 2; శార్దుల్ (సి) పీటర్సన్ (బి) కేశవ్ 12; బుమ్రా (సి) ఎల్గర్ (బి) రబడ 0; ఉమేశ్ (నాటౌట్) 4; షమీ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (77.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–31, 2–33, 3–95, 4–116, 5–167, 6–175, 7–205, 8–210, 9–211, 10–223. బౌలింగ్: రబడ 22–4–73–4, ఒలీవియర్ 18–5–42–1, జాన్సెన్ 18–6–55–3, ఎన్‌గిడి 14.3–7–33–1, కేశవ్ మహరాజ్ 5–2–14–1.
Comments
Please login to add a commentAdd a comment