IND Vs SL 3rd ODI: చివరి వన్డేలో శ్రీలంక విజయం | India Vs Sri Lanka 3rd ODI Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND Vs SL 3rd ODI: చివరి వన్డేలో శ్రీలంక విజయం

Published Fri, Jul 23 2021 3:06 PM | Last Updated on Sun, Jul 25 2021 7:31 PM

India Vs Sri Lanka 3rd ODI Live Updates And Highlights - Sakshi

శ్రీలంక విజయం
కొలంబో వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై శ్రీలంక జట్టు విజయం సాధించింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక జట్టులో అవిష్క ఫెర్నాండో 98 బంతుల్లో 76 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

35 ఓవర్లు 211/5
35 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు విజయం 72 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. 

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వా(2) ఔట్‌
అరంగేట్రం బౌలర్‌ చేతన్‌ సకారియా వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అప్పుడే క్రీజ్లోకి వచ్చిన ధనంజయ డిసిల్వా(9 బంతుల్లో 2)ను కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా ఔట్‌ చేశాడు. 25 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 151/3. లంక గెలవాలంటే 22 ఓవర్లలో 76 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో ఫెర్నాండో(60), అసలంక(0) ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. రాజపక్సే(65) ఔట్‌
చేతన్‌ సకారియా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌ క్యాచ్‌ అందుకోవడంతో రాజపక్సే(56 బంతుల్లో 65; 12 ఫోర్లు) వెనుదిరిగాడు. అంతకుముందు బంతికే నితీశ్‌ రాణా క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో లైఫ్‌ వచ్చినప్పటికీ.. రాజపక్సే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 23 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 144/2. క్రీజ్‌లో ఫెర్నాండో(57), ధనంజయ డిసిల్వా(0) ఉన్నారు. లంక గెలవాలంటే 24 ఓవర్లలో 83 పరగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండటంతో లంక గెలుపు నల్లేరుపై నడకే.

రాజపక్సే ఫిఫ్టి.. గెలుపు దిశగా లంకేయులు
వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ భానుక రాజపక్సే కెరీర్‌లో తొలి అర్ధశతకం సాధించాడు. అతను 42 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 20 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌127/1. లంక గెలుపునకు మరో 99 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో రాజపక్సేకు తోడుగా ఫెర్నాండో(55) ఉన్నాడు.

నిలకడగా ఆడుతున్న లంక ప్లేయర్లు.. హాఫ్‌ సెంచరీ చేసిన ఫెర్నాండో
ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 6 రన్‌రేట్‌ తగ్గకుండా లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ క్రమంలో లంక ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో(53 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్‌) కెరీర్‌లో ఐదో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్సే(32 బంతుల్లో 33; 6 ఫోర్లు) సైతం బంతికో పరుగు చొప్పున రాబడుతూ నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోర్‌ 104/1గా ఉంది. 

లంక తొలి వికెట్‌ డౌన్‌.. భానుక(7) ఔట్‌
226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 35 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్‌ భానుక(17 బంతుల్లో 7; ఫోర్‌)ను కృష్ణప్ప గౌతమ్‌ బోల్తా కొట్టించాడు. స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో స్క్వేర్‌ లెగ్‌లో ఉన్న సకారియాకు క్యాచ్‌ అందించి భానుక వెనుదిరిగాడు. 6 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 35/1. క్రీజ్‌లో రాజపక్సే(0), అవిష్క ఫెర్నాండో(17 బంతుల్లో 21) ఉన్నారు. 

225 పరుగులకు టీమిండియా ఆలౌట్‌.. లంక టార్గెట్‌ 226
చమీరా బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండో క్యాచ్‌ అందుకోవడంతో నవ్‌దీప్‌ సైనీ(36 బంతుల్లో 15)  ఔటయ్యాడు. దీంతో టీమిండియా 43.1 ఓవర్‌లో 225 పరగులకు ఆలౌటైంది. సకారియా(0) నాటౌట్‌గా మిగిలాడు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ, జయవిక్రమ తలో మూడు వికెట్లు.. చమీరా రెండు వికెట్లు.. షనక, కరుణరత్నే చెరో వికెట్‌ పడగొట్టారు.

రాహుల్‌ చాహర్‌ ఔట్‌(13).. తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
కరుణరత్నే బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ చాహర్‌(25 బంతుల్లో 13) వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 225/9. క్రీజ్‌లో సైనీ(15), సకారియా(0) ఉన్నారు.

కష్టాల్లో టీమిండియా.. ఐదు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు డౌన్‌
33వ ఓవర్‌లో స్పిన్నర్‌ అఖిల ధనంజయ టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులిచ్చిన అతను.. కీలకమైన నితీశ్‌ రాణా(14 బంతుల్లో 7), కృష్ణప్ప గౌతమ్‌(3 బంతుల్లో 2) వికెట్లు పడగొట్టాడు. తొలుత కృష్ణప్ప గౌతమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను.. ఆతరువాత నితీశ రాణాను ఔట్‌ చేశాడు. వికెట్‌ కీపర్‌ భానుక క్యాచ్‌ అందుకోవడంతో రాణా వెనుదిరగక తప్పలేదు. దీంతో 33 ఓవర్లకే టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్‌ చాహర్‌(1) నవ్‌దీప్‌ సైనీ(0) ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్‌(40) ఔట్‌
నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌(37 బంతుల్లో 40; 7 ఫోర్లు) ధనంజయ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత ధనంజయ అపీల్‌కు ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా, శ్రీలంక జట్టు రివ్యూ కోరింది. ఇందులో సూర్యకుమార్‌ ఔటైనట్లు రుజువు కావడంతో అతను వెనుదిరగాల్సి వచ్చింది. 31 ఓవర్ల తర్వాత భారత స్కోర్‌ 190/6. క్రీజ్‌లో నితీశ్‌ రాణా(5), కృష్ణప్ప గౌతమ్‌(0) ఉన్నారు. 

మరోసారి నిరాశపరిచిన హార్ధిక్‌
టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా(11 బంతుల్లో 19; 3 ఫోర్లు) మరోసారి నిరాశపరిచాడు. కీలక సమయంలో భారీ స్కోర్‌ సాధిస్తాడని ఆశించిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. జయవిక్రమ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటై ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 29 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 184/5. క్రీజ్‌లో సూర్యకుమార్‌ (38), నితీశ్‌ రాణా(1) ఉన్నారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. మనీశ్‌ పాండే(11) ఔట్‌
వరుణుడు శాంతించడంతో మ్యాచ్‌ తిరిగి ఫ్రారంభంమైంది. రెయిన్‌ బ్రేక్‌ తర్వాత రెండో ఓవర్‌లోనే మనీశ్‌ పాండే(19 బంతుల్లో 11) పెవిలియన్‌ బాట పట్టాడు. జయవిక్రమ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 25 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 158/4. క్రీజ్‌లో సూర్యకుమార్‌(24 బంతుల్లో 31; 6 ఫోర్లు), హార్ధిక్‌ పాండ్యా(1) ఉన్నారు.

శాంతించిన వరుణుడి.. మ్యాచ్‌ పునఃప్రారంభం, 47 ఓవర్లకు కుదింపు
వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్‌ పునఃప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం 6:30PMకు మ్యాచ్‌ మొదలుకానుంది. అయితే మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి టీమిండియా స్కోర్‌ 23 ఓవర్లలో 147/3గా ఉంది. క్రీజ్‌లో మనీశ్‌ పాండే(15 బంతుల్లో 10), సూర్యకుమార్‌ యాదవ్‌(17 బంతుల్లో 22; 4 ఫోర్లు) ఉన్నారు.

వరుణుడి ఆటంకం, 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 147/3
టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు మనీశ్‌ పాండే(15 బంతుల్లో 10), సూర్యకుమార్‌ యాదవ్‌(17 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న సందర్భంలో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. చినుకులతో మొదలై క్రమంగా పెద్ద వర్షంగా మారడంతో రిఫరి మ్యాచ్‌ను నిలిపివేశాడు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంక బౌలర్లలో శనక, జయవిక్రమ, చమీర తలో వికెట్‌ పడగొట్టారు. 

సామ్సన్‌(46) ఔట్‌, 19 ఓవర్ల తర్వాత 120/3
16 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 102 పరుగుల వద్ద పృథ్వీ షా(49) వికెట్‌ను కోల్పోయిన భారత్‌.. 118 పరుగుల వద్ద అరంగేట్రం ఆటగాడు సామ్సన్‌(46 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. ఇద్దరు సెట్‌ బ్యాట్స్‌మెన్‌ ఇంత తక్కువ పరుగలు వ్యవధిలో ఔట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడినట్లైంది. జయవిక్రమ బౌలింగ్‌లో అవిష్క ఫెర్నాండోకు సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి సామ్సన్‌ పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 120/3. క్రీజ్‌లో మనీశ్‌ పాండే(4), సూర్యకుమార్‌ యాదవ్‌(1) ఉన్నారు. 

తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్న పృథీ​ షా
టీమిండియా ఓపెనర్‌ పృథీ​ షా(49 బంతుల్లో 49; 8 ఫోర్లు).. తన తొలి వన్డే హాఫ్‌ సెంచరీ కోసం మరి కొంతకాలం వేచి చూడాల్సి ఉంది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి స్టార్ట్‌ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయిన షా.. ఈ మ్యాచ్‌లో జాగ్రత్తగానే ఆడినా కేవలం ఒక్క పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీని మిస్‌ అయ్యాడు. లంక కెప్టెన్‌ శనక బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 102/2. క్రీజ్‌లో సామ్సన్‌(35 బంతుల్లో 33, 3 ఫోర్లు, సిక్స్‌), మనీశ్‌ పాండే ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. ధవన్‌(13) ఔట్‌ 
రెండో ఓవర్‌లో ధనంజయ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాది జోరును కనబర్చిన టీమిండియా కెప్టెన్‌ ధవన్‌(11 బంతుల్లో 13; 3 ఫోర్లు).. ఆ జోరును ఎంతో సేపు కొనసాగించలేకపోయాడు. మూడో ఓవర్‌లో చమీరా బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా మరో ఓపెనర్‌ పృథ్వీషా(4 బంతుల్లో 10; 2 ఫోర్లు) సైతం దూకుడుగానే ఆడుతున్నాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్‌ 29/1గా ఉంది. ధవన్‌ స్థానంలో క్రీజ్‌లోకి సంజూ సామ్సన్‌ వచ్చాడు. 

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఎట్టకేలకు టాస్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగుతున్న ధవన్‌ సేన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మరోవైపు లంక కూడా నామమాత్రపు మ్యాచ్‌ కావడంతో మూడు మార్పులతో బరిలోకి దిగింది. 

భారత తుది జట్టు: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌, నితీశ్‌ రాణా, హార్దిక్‌ పాండ్యా, క్రిష్ణప్ప గౌతం, రాహుల్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

శ్రీలంక తుది జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భనుక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్‌ అసలంక, దసున్‌ శనక(కెప్టెన్‌), రమేశ్‌ మెండిస్‌, చమిక కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీరా, ప్రవీన్‌ జయవిక్రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement