India Vs West Indies ODI Series 2022- అహ్మదాబాద్: రోహిత్ శర్మ నాయకత్వంలో సొంతగడ్డపై టీమిండియా మరో విజయంపై దృష్టి పెట్టింది. బుధవారం జరిగే రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఇప్పటికే 1–0తో ఆధిక్యం లో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను దక్కించుకుంటుంది. మరోవైపు సిరీస్‌ను కాపాడుకోవాలంటే విండీస్‌కు గెలుపు తప్పనిసరి. అయితే గత మ్యాచ్‌లో వచ్చిన ఏకపక్ష ఫలితం, బలాబలాలు చూస్తే భారత్‌ను నిలువరించడం వెస్టిండీస్‌కు సాధ్యం కాకపోవచ్చు. పిచ్ గత మ్యాచ్ తరహాలోనే స్పిన్‌కు కాస్త అనుకూలించనుంది. వేసవి ప్రారంభం కావడంతో మంచు ప్రభావం లేదు.
హుడా స్థానంలో రాహుల్...
తొలి వన్డేలో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అటు బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన తర్వాత బ్యాటింగ్ జోరుతో 28 ఓవర్లలోనే ఆట ముగించింది. సాధారణంగానైతే తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుతో చేరాడు. అతను మిడిలార్డర్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే దీపక్ హుడాను పక్కన పెట్టాల్సి ఉంటుంది.
మిడిలార్డర్‌లో కోహ్లి, పంత్, సూర్యకుమార్‌ల స్థానాల్లో మార్పు సాధ్యం కాదు కాబట్టి హుడాపైనే వేటు పడనుంది. మరోవైపు ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్ లో కూడా భారత్ అంచనాలకు అనుగుణంగా రాణించింది. ఇద్దరు స్పిన్నర్లు చహల్, సుందర్ కలిసి ఏడు వికెట్లు తీశారు. కాబట్టి స్పిన్ విభాగంలో మార్పుకు అవకాశం తక్కువ. ఇద్దరు పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కూడా ఆకట్టుకున్నారు. వైవిధ్యం కోసం చైనామన్ బౌలర్ కుల్దీప్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే శార్దుల్‌ను పక్కన పెట్టవచ్చు. స్పల్ప మార్పులు చేసినా సరే భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
పొలార్డ్ రాణించేనా...
తొలి వన్డేలో విండీస్ ఘోరంగా విఫలమైంది. భారీ హిట్టర్లుగా గుర్తింపు ఉన్న ఆ జట్టు బ్యాటర్లు టి20 ఇన్నింగ్స్ వరకు కూడా నిలువలేకపోయారు. 22 ఓవర్ల లోపే జట్టు 7 వికెట్లు కోల్పోవడం బ్యాటింగ్ పరిస్థితిని చూపించింది. హోల్డర్ ఆదుకోకపోతే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉండేది. ఈ మ్యాచ్‌లోనైనా టీమ్ బ్యాటర్లు మంచి ప్రదర్శన ఇస్తారా అనేది చూడాలి. హోప్, పూరన్‌ల దూకుడైన బ్యాటింగ్‌పై విండీస్ ఆశలు పెట్టుకుంది.
అయితే అన్నింటికి మించి కెప్టెన్ పొలార్డ్ రాణించడం జట్టుకు అవసరం. గత మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన అతను ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది కీలకం. హోల్డర్ ఆల్‌రౌండర్‌గా తనదైన స్థాయిని ప్రదర్శిస్తున్నాడు. గత మ్యాచ్‌లో స్కోరు చాలా చిన్నది కావడంతో విండీస్ బౌలర్లు ఏమీ చేయలేకపోయారు. పర్యాటక జట్టు సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెట్టింపు శ్రమించక తప్పదు.
చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..!
Comments
Please login to add a commentAdd a comment