బ్రిడ్జ్‌టౌన్: కరీబియన్‌లో భారత జట్టు ప్రపంచకప్ సన్నాహం పేలవంగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆశావహులే కాదు... కచ్చితంగా పరిశీలనలో ఉన్న క్రికెటర్లు కూడా నిరాశపరిచారు. బార్బోడస్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది.
ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించాడు. రొమారియో షెఫర్డ్ (3/37), గుడకేశ్ మోతీ (3/36), అల్జారి జోసెఫ్ (2/35) కలిసికట్టుగా భారత్‌ను కట్టడిచే శారు. కుర్రాళ్లను పరీక్షించడం కోసం స్టార్ బ్యాటర్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలకు రెండో వన్డేలో విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు.
ఆ ఇద్దరి స్థానాల్లో సంజూ సామ్సన్, అక్షర్ పటేల్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్లు మినహా...
టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగానే... భారత బ్యాటింగ్ లైనప్ చూసుకొని సగటు క్రికెట్ అభిమాని గర్వం! ఇక మనవాళ్లు కుమ్మెస్తారనే గంపెడాశలు! కానీ 50 ఓవర్ల పాటు కూడా కరీబియన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడమే పెద్ద షాక్. ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన ఇషాన్ కిషన్ గానీ, శుబ్‌మన్ గిల్ గానీ చెప్పుకోదగ్గ మెరుపులే మెరిపించలేదు. అయితే భారత ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరే కుదురుగా ఆడారు. దీంతో జోరు లేకపోయినా స్కోరు బోర్డు మందకొడిగా సాగింది.
అడపాదడపా బౌండరీలే తప్ప అలరించే సిక్సర్లు కరువయ్యాయి. గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఇషాన్ కొట్టిన ఏకైక సిక్సరే ఇన్నింగ్స్‌కు బంగారమైంది! ఆ తర్వాత హార్డ్ హిట్టర్లు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాల వల్ల కూడా ఒక్క సిక్సర్ అయినా నమోదు కాలేదు. 17వ ఓవర్లో ఇషాన్ ఇషాన్ ఫిఫ్టీ 51 బంతుల్లో పూర్తికాగానే... అదే ఓవర్లో శుబ్‌మన్ నిష్క్రమించాడు. దీంతో 90 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లో ఇషాన్ ఆటకు షెఫర్డ్ చెక్ పెట్టాడు.
వీళ్లిద్దరు ఉన్నంతసేపే పరుగులొచ్చాయి. ఆ తర్వాత వికెట్లే రాలాయి. అక్షర్ పటేల్ (1)ను నాలుగో స్థానంలో ప్రమోషన్‌గా దింపితే తీవ్రంగా నిరాశ పరిచాడు. 97 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో ఆదుకుంటాడనుకున్న పాండ్యా (7) కూడా ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచాడు.
సూర్యకుమార్ (25 బంతుల్లో 24; 3 ఫోర్లు) మెరిపించలేకపోయినా కాసేపు కుదురుగా ఆడాడు. జడేజా (10), శార్దుల్ (16; 2 ఫోర్లు) ఇలా అందరు వచ్చిన దార్లోనే పెవిలియన్ చేరడంతో మొదటి 90 పరుగుల వరకు వికెట్ కోల్పోని భారత్... తర్వాతి 91 పరుగులకే అన్ని వికెట్లు (10) కోల్పోయి సుమారు పది ఓవర్ల ముందే ఆలౌటైంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) అతనెజ్ (బి) షెఫర్డ్ 55; గిల్ (సి) జోసెఫ్ (బి) మోతీ 34; సామ్సన్ (సి) కింగ్ (బి) కరియ 9; అక్షర్ (సి) హోప్ (బి) షెఫర్డ్ 1; పాండ్యా (సి) కింగ్ (బి) సీల్స్ 7; సూర్యకుమార్ (సి) అతనెజ్ (బి) మోతీ 24; జడేజా (సి) కరియ (బి) షెఫర్డ్ 10; శార్దుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జోసెఫ్ 16; కుల్దీప్ నాటౌట్ 8; ఉమ్రాన్ (సి) కార్టీ (బి) జోసెఫ్ 0; ముకేశ్ (సి) హెట్‌మైర్ (బి) మోతీ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–90, 2–95, 3–97, 4–113, 5–113, 6–146, 7–148, 8–167, 9–167, 10–181. బౌలింగ్: మేయర్స్ 5–0–18–0, సీలెస్ 6–0–28–1, జోసెఫ్ 7–0–35–2, గుడకేశ్ మోతీ 9.5–0– 36–3, షెఫర్డ్ 8–1–37–3, కరియ 5–0–25–1.
Comments
Please login to add a commentAdd a comment