పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) జరగాల్సిన ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇవాళ (అక్టోబర్ 18) స్పష్టం చేశాడు. ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ 91వ ఏజీఎమ్ (వార్షిక సాధారణ సమావేశం) సందర్భంగా షా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
ఆసియా కప్ వన్డే టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహిస్తే పాల్గొనేందుకు తమకెటువంటి అభ్యంతరం లేదని, లేదు పాక్‌లోనే నిర్వహిస్తామని పట్టుబడితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనదని వెల్లడించాడు. ప్రస్తుతం పాక్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా దాయాది దేశంలో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమని షా పేర్కొన్నాడు.
కాగా, పాక్‌లో జరిగే ఆసియా కప్-2023 వన్డే టోర్నీలో భారత్ పాల్గొంటుందని గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున ప్రచారం జరిగింది. బీసీసీఐ గత వార్షిక సమావేశంలో బోర్డు సభ్యులు కూడా ఇందుకు సమ్మతి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ దిగిపోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయిపోయాయి.
ఏదిఏమైప్పటికీ భారత్.. పాక్‌లో పర్యటించేది లేదని తేలిపోవడంతో ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. భారత్.. తమ దేశంలో అడుగుపెడితే బాగా కూడబెట్టుకోవచ్చన్న పాక్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లినట్లైంది. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన పురుషుల ఆసియా కప్ టీ20 టోర్నీ కూడా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో జరగాల్సి ఉండింది. అయితే ఆర్ధిక సంక్షోభం కారణంగా టోర్నీని నిర్వహించలేమని లంక బోర్డు చేతులెత్తేయడంతో వేదికను అప్పటికప్పుడు యూఏఈకి మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment